బస్సు ఢీ కొన్న ఘటనలో మరణించిన మహిళ కుటుంబానికి రూ.9కోట్ల (మరింత కచ్ఛితంగా చెప్పాలంటే రూ.9,64,52,220) పరిహారం ఇవ్వాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. దీనికి సంబంధించిన తీర్పును సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పును ఇచ్చింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న మహిళ పేరు లక్ష్మి నాగళ్ల. ఆమె 2009 జూన్ 13న భర్త.. ఇద్దరు కుమార్తెలతో కలిసి కారులో అన్నవరం నుంచి రాజమహేంద్రవరానికి వెళుతున్నారు. ఈ సందర్భంగా వీరి వాహనానికి ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో లక్ష్మి మరణించారు. అమెరికాలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్చేసి.. ఆ దేశ శాశ్విత నివాసిగా ఉన్న తన భార్య అక్కడే నెలకు 11,600 డాలర్లు సంపాదిస్తున్నారని.. ఆమె మరణానికి కారణమైన ఆర్టీసీ నుంచి రూ.9 కోట్లు పరిహారం ఇప్పించాలని భర్త శ్యాంప్రసాద్ నాగళ్ల సికింద్రాబాద్ మోటార్ యాక్సిడెంట్స్ ట్రైబ్యునల్ లో కేసు వేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న ట్రైబ్యునల్ రూ.8.05 కోట్ల పరిహారం చెల్లించాలని ఆర్టీసీని 2014లో ఆదేశించింది.
అయితే..ఈ తీర్పును సవాలు చేస్తూతెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీనికి బదులుగా తెలంగాణ హైకోర్టు రూ.5.75 కోట్ల పరిహారం ఇవ్వాలంటూ తీర్పును ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ మరణించిన మహిళ భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు..బాధితురాలి కుటుంబానికి రూ.9.64 కోట్ల భారీ పరిహారాన్ని ఆర్టీసీ చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది.