ఏం చేయాలో నాకు తెలుసు.. రోహిత్ స్ట్రాంగ్ కౌంటర్!

ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమవుతున్న తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మ మొన్నటివరకు వరుసగా విఫలమవ్వడం జట్టుకు భారంగా మారిందనే కామెంట్స్ ఎక్కువగానే వచ్చాయి. ఫ్యాన్స్ తో పాటు సీనియర్ ఆటగాళ్లు సైతం పెదవివిరిచారు. అయితే ఈ ఒత్తిడిలోనే అతను బౌన్స్ బ్యాక్ అయ్యాడు.

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ల్ రోహిత్ శర్మ తన పూర్వవైభవాన్ని తలపించారు. 90 బంతుల్లో 119 పరుగులు చేసి జట్టును విజయంలోకి నడిపించడమే కాకుండా, తన రీఎంట్రీను ఘనంగా ప్రదర్శించారు.

2023 అక్టోబర్‌ తర్వాత వన్డేల్లో రోహిత్‌ చేసిన తొలి సెంచరీ ఇది. గత 13 మ్యాచ్‌ల్లో అయిదు అర్ధశతకాలు చేసినప్పటికీ, పూర్తి స్థాయి శతకాన్ని నమోదు చేయడం ద్వారా ఫామ్‌ను తిరిగి అందుకున్నట్లు కనిపిస్తోంది. ఇక రోహిత్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఒక విధంగా విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటట్ ఇచ్చారని చెప్పవచ్చు. ‘‘నేను చాలా కాలంగా క్రికెట్‌ ఆడుతున్నా. ఏమి చేయాలో నాకు తెలుసు. ఫామ్‌ను తిరిగి అందుకోవడం అంత తేలిక కాదు, కానీ ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకుని ముందుకు సాగా’’ అని చెప్పారు.

బ్యాటింగ్‌ శైలిలో ఎలాంటి మార్పు చేయలేదని, తన సహజమైన ఆటతీరు ద్వారా ఫలితం సాధించగలిగానని రోహిత్‌ వివరించారు. పరుగులు చేయడం గురించి తనకు పూర్తిగా అవగాహన ఉన్నప్పటికీ, కొన్నిసార్లు ఒత్తిడి, ఆటతీరు ప్రభావం చూపిస్తుందని రోహిత్‌ అన్నారు.

‘‘కెరీర్‌లో ఎన్నో పరుగులు చేశా. కానీ ఫామ్‌లోకి రావడం కష్టమే. ఎంతో శ్రమించాక మంచి ఇన్నింగ్స్ ఆడగలిగాను. నిజంగా ఆనందంగా ఉంది’’ అని తెలిపారు. ఈ సెంచరీతో రోహిత్‌ మాత్రమే కాదు, భారత జట్టుకూ ఊరట లభించింది.

ముఖ్యంగా ఛాంపియన్స్‌ ట్రోఫీ ముందు రోహిత్‌ ఫామ్‌ సాధించడం టీమిండియాకు మేలే. టోర్నమెంట్‌లో భారత జట్టు విజయవంతంగా రాణించాలంటే రోహిత్‌ లాంటి సీనియర్ ఆటగాళ్ల పరుగులు అవసరం.