సెంట్రల్ అమెరికాలోని గ్వాటెమాలా దేశం ఒక ఘోర రోడ్డు ప్రమాదంతో విషాదంలో మునిగిపోయింది. రాజధాని గ్వాటెమాలా సిటీ సమీపంలో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ బస్సులో మొత్తం 75 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 51 మృతదేహాలను వెలికితీసినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో 36 మంది పురుషులు, 15 మంది మహిళలు మృతిచెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కొందరు ప్రయాణికులు ప్రమాద సమయంలో నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు మోయిసెస్ కాస్టిల్లో శివార్లలోని వంతెనపై నుంచి లోయలో పడిపోయిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
ఈ ఘోర ప్రమాదంపై గ్వాటెమాలా అధ్యక్షుడు బెర్నార్డో అరేవా తీవ్రంగా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. సహాయక చర్యలను మరింత వేగంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని సూచించారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సమీక్షించేందుకు సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇచ్చారు.