క్షణానికో కోడి.. గోదావరి జిల్లాల్లో బర్ద్ ఫ్లూ విజృంభణ

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో గత కొంతకాలంగా కోళ్ల ఫారాల్లో పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. నెల రోజులుగా జరగుతున్న కోళ్ల మరణాలపై అధికారులు అప్రమత్తం అయ్యారు. చనిపోయిన కోళ్ల నమూనాలను అధికారులు భోపాల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్ కు పంపారు. ఈ నమూనాలను పరిశీలించిన అక్కడి శాస్త్రవేత్తలు.. గోదావరి జిల్లాల కోళ్లకు బర్ద్ ఫ్లూ సోకిందని నిర్ధారించారు. ఈ నివేదికలు వచ్చినంతనే.. గోదావరి జిల్లాల్లో కలకలం నెలకొంది.

అదే సమయంలో బర్ద్ ఫ్లూ మరింతగా విస్తరించింది. ఫలితంగా ఈ రెండు జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. క్షణానికి ఓ కోడి చనిపోతోంది అంటూ కోళ్ల ఫారాల యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 లక్షల కోట్లతో తాను ఓ ఫారాన్ని నిర్వహిస్తుంటే.. అందులో 1.75 లక్షల కోళ్లు చనిపోయాయి అని ఓ యజమాని భోరుమన్నారు. అయితే ఉభయ గోదావరి జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో బర్ద్ ఫ్లూ లేదని అధికారులు చెబుతున్నారు. బర్ద్ ఫ్లూ ప్రబలిందని గుర్తించిన ప్రాంతాలను బఫర్ జోన్లుగా ప్రకటించిన అధికారులు… వ్యాధి ఇతర ప్రాంతాలకు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

బర్ద్ ఫ్లూ ప్రబలిన నేపథ్యంలో చికెన్ ప్రియులు భయకంపితులు అవుతున్నారు. ఫ్లూ సోకిన చికెన్ తింటే ప్రమాదమన్న భావన వారిని ఆందోళనకు గురి చేస్తోంది. అయితే బర్ద్ ఫ్లూ ప్రబలిన ప్రాంతాలను ఇప్పటికే బఫర్ జోన్లుగా ప్రకటించామని… అక్కడి కోళ్లు బయటకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. వ్యాధిని అక్కడికక్కడే కట్టడి చేస్తున్నామని… ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా చికెన్, గుడ్లని బాగా ఉడికించి తింటే సరిపోతుందని అధికారులు సూచిస్తున్నారు.