పెళ్లి ర‌ద్దు: సిబిల్ స్కోర్‌.. ఎంత ప‌నిచేసింది!

పెళ్లిళ్లు జ‌ర‌గ‌డం.. జ‌ర‌గ‌క‌పోవ‌డం అనేది కామ‌నే. కానీ, ఇటీవ‌ల కాలంలో జ‌రుగుతున్న పెళ్లిళ్ల కంటే కూడా.. ర‌ద్ద‌వుతున్న పెళ్లిళ్ల వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగాను.. ఒకింత ఆవేద‌న‌గానూ ఉంటున్నాయి. పెళ్లి పీట‌లు ఎక్కి మూడు ముడులు ప‌డే దాకా కూడా.. ఈ పెళ్లి జ‌రుగుతుందో లేదో !? అనే సందేహాలు చుట్టుముడు తున్నాయి. ఇటీవ‌ల పెళ్లి పీట‌ల‌పై కూర్చున్న వ‌రుడు.. చోళీకే పీచే క్యాహై పాట‌కు డ్యాన్స్ చేయ‌డంతో పెళ్లి కుమార్తె తండ్రికి చిరాకెత్తి స‌ద‌రు పెళ్లిన ర‌ద్దు చేసుకున్నాడు. అంతేకాదు.. పీట‌ల‌పై ఉన్న వ‌ధువును బ‌ర‌బ‌రా లాక్కుని వెళ్లిపోయారు.

తాజాగా సిబిల్ స్కోర్‌ కూడా ఇలాంటి ప‌నే చేసింది. మ‌రో రెండు రోజుల్లో పెళ్లి ఉంద‌న‌గా.. వ‌రుడి సిబిల్ స్కోర్‌ను చెక్ చేసిన వ‌ధువు కుటుంబం.. గుండెలు బాదుకుంటూ.. పెళ్లిని ర‌ద్దు చేసుకుంది. అమ్మో.. పెళ్లికాకుముందే.. ఇన్ని అప్పులా? ఇన్ని ఎగ‌వేత‌లా? అంటూ.. పెళ్లి కుమార్తె మేన‌మామ ఇచ్చిన స‌మాచారంతో వ‌ధువు తండ్రి నిర్మొహ‌మాటంగా.. మాకు మీతో సంబంధం వ‌ద్దు అని చెప్పేశారు. దీంతో వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు మ‌ధ్య‌లోనే ఆగిపోయాయి.

ఏం జ‌రిగింది?

మ‌హారాష్ట్ర‌లోని మూర్తిజాపూర్‌కు చెందిన యువ‌తికి.. ఇదే ప్రాంతానికి చెందిన యువ‌కుడితో వివాహం నిశ్చ‌య‌మైంది. అన్నీ మాట్లాడుకున్నారు. ఇచ్చి పుచ్చుకోవ‌డాలు కూడా అయిపోయాయి. ముహూర్తం కూడా పెట్టేసుకున్నారు. అంతా బాగుంద‌న్న స‌మ‌యానికి.. వ‌ధువు మేన‌మామ‌(అమ్మ సోద‌రుడు)కు ఎందుకో సందేహం వ‌చ్చి..వ‌రుడి పాన్ కార్డు తీసుకుని అత‌ని డిజిట‌ల్ లావాదేవీల ప‌రిస్థితిని తెలుసుకున్నాడు. ఈ క్ర‌మంలో సిబిల్ స్కోరు 360 ద‌గ్గ‌ర ఆగిపోవ‌డాన్ని గుర్తించాడు. అంతేకాదు.. ఆయ‌న ప‌లు బ్యాంకుల నుంచి వ్య‌క్తిగ‌త రుణాలు తీసుకున్న తీసుకున్న విష‌యం బ‌య‌ట ప‌డింది.

ఈ క్ర‌మంలో ఒక‌టి రెండు బ్యాంకుల‌కు ఎగ‌వేత‌లు కూడా న‌మోదయ్యాయి. దీంతో నే సిబిల్ దారుణంగా ఉంద‌ని గుర్తించిన స‌ద‌రు మేన‌మామ‌.. విష‌యాన్ని వ‌ధువు తండ్రి(బావ‌)కి తెలియ‌జేశాడు. అంతే.. ఇంకేముంది.. పెళ్లికి ముందే అప్పులు-ఎగ‌వేత‌ల్లో అబ్బాయి తీరిక లేకుండా ఉన్నాడ‌ని.. రేపు అమ్మాయిని ఇస్తే.. త‌మ కుమార్తె ప‌రిస్థితి ఏంట‌ని కొంత ముందుచూపుతో ఆలోచించిన వ‌ధువు తండ్రి.. మీ అబ్బాయి వ‌ద్దులే అని క‌బురు పెట్ట‌డంతో పెళ్లిపోయాయి. కాగా.. ఈ విష‌యం సోష‌ల్ మీడియాకు ఎక్క‌డంతో ఆశ్చ‌ర్య పోవ‌డం.. బుగ్గ‌లు నొక్కుకోవ‌డం.. ఇప్పుడు ప్రతి ఒక్క‌రి వంతైంది. ఇలా కూడా పెళ్లిళ్లు ఆగిపోతాయా? అని నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.