అమెరికాలో మరో విమాన ప్రమాదం.. 8 రోజుల్లో ఇది మూడోది!

అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జనవరి 29న వాషింగ్టన్ సమీపంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ జెట్, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొని 67 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే నెల 31న ఫిలడెల్ఫియాలో ఓ రవాణా విమానం కూలిపోయి ఆరుగురు మరణించారు. తాజాగా అలాస్కాలో ఈ విమాన ప్రమాదం చోటుచేసుకోవడంతో, గత ఎనిమిది రోజుల్లో అమెరికాలో మూడు ప్రమాదాల్లో 84 మంది ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా పశ్చిమ అలాస్కాలోని నోమ్ కమ్యూనిటీకి వెళ్తున్న విమానం సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనా లో పైలట్‌తో సహా పది మంది ప్రాణాలు కోల్పోయారు. విమానం శిథిలాలను సముద్రంలో గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి మైక్ సలెర్నో రెస్క్యూ టీం తక్షణమే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. టేకాఫ్ అయిన గంటలోపే విమానం ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)తో సంబంధాలు కోల్పోయిందని అధికారులు చెప్పారు.

అలాస్కా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ప్రకారం, బెరింగ్ ఎయిర్‌కు చెందిన సెస్నా కారవాన్ అనే విమానం గురువారం ఉనల్కలేట్ నుంచి నోమ్ నగరానికి బయలుదేరింది. ఆ విమానంలో తొమ్మిది మంది ప్రయాణికులతో పాటు పైలట్ ఉన్నారు. అయితే, ప్రయాణానికి అనుకూలంగా వాతావరణం లేకపోవడంతో ఘటన చోటుచేసుకుంది. నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ హిమపాతం, పొగమంచు ప్రభావం అధికంగా ఉండటంతో పరిస్థితులు అత్యంత క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది. విమానం ప్రమాదానికి గల అసలు కారణాన్ని తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది.

యూఎస్ కోస్ట్ గార్డ్ లెఫ్టినెంట్ కమాండర్ బెంజమిన్ మెక్ఇంటైర్ కోబుల్ మాట్లాడుతూ, ప్రమాదం కంటే ముందు విమానం నుంచి ఎలాంటి డిస్ట్రెస్ సిగ్నల్ రాలేదని చెప్పారు. సాధారణంగా, విమానాల్లో అత్యవసర లొకేటింగ్ ట్రాన్స్మిటర్ అనే ప్రత్యేకమైన పరికరం ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగితే, ఇది ఉపగ్రహానికి సంకేతాన్ని పంపుతుంది. ఆ సిగ్నల్ ఆధారంగా కోస్ట్ గార్డ్ సహాయక చర్యలు చేపడుతుంది. కానీ, ఈ ఘటనలో అలాంటి ఎలాంటి సంకేతాలు రాకపోవడం సందేహాలను పెంచుతోంది.