రూ.99తో హైదరాబాద్ నుంచి విజయవాడకు…!

హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.99తో విజయవాడకు వెళ్ళొచ్చా? నిజంగానా? అని ఆశ్యర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఈటీఓ మోటార్స్ ఈ కొత్త చౌక ప్రయాణాన్ని అందిస్తోంది. అది కూడా ఏసీ సౌకర్యంతో కూడిన జర్నీని ఈ సంస్థ మనకు అందించనుంది. ఈ సర్వీసులను తెలంగాణ రవాణా సఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సర్వీసులు మూడు నుంచి నాలుగు వారాల్లో అందుబాటులోకి రానున్నాయి. తొలుత హైదరాబాద్, విజయవాడల మధ్యలో మాత్రమే అందుబాటులో ఉండే ఈ సర్వీసులు మలి దశలో హైదరాబాద్, విశాఖపట్నంల మధ్య కూడా అందుబాటులోకి రానున్నాయి.

ఏసీ సౌకర్యం కలిగిన ఈ బస్సు సేవలు ఫ్లిక్ బస్సు పేరిట అందుబాటులోకి రానున్నాయి. ఈ బస్సులలో హైదరాబాద్ నుంచి విజయవాడకు ఛార్జ్ కేవలం రూ.99 మాత్రమే. అయితే ఈ తక్కువ చార్జీలు కేవలం 4 వారాలపాటు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ఈ చార్జీలను పెంచే అవకాశం ఉంది. అయితే ఎంతమేర చార్జీలను పెంచుతారన్న దానిపై స్పష్టమైన సమాచారం లేదనే చెప్పాలి ఈ విషయాన్నీ అటు ఈటీఓ మోటార్స్ గానీ, మంత్రి పొన్నం గానీ వెల్లడించలేదు. ఏసీ బస్సు లో హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం రూ.99కే జర్నీ అంటే చౌకనే కదా. ఈ చార్జీలను ఆ తర్వాత పెంచినా పెద్దగా తేడా రాకుండానే ఈటీఓ మోటార్స్ జాగ్రత్త పడే అవకాశాలు ఉన్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ సేవలతో తక్కువ చార్జీలతోనే ప్రయాణాలు అందుబాటులోకి వస్తాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఫ్లిక్ బస్సు సేవలను ఈటీఓ మోటార్స్ సంస్థ తొలిసారిగా హైదరాబాద్, విజయవాడల మధ్యే నడపనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే రెండు తెలుగు రాష్ట్రాల్లోని మరిన్ని నగరలాకు విస్తరించనున్నట్లు ఫ్లిక్ బస్సు సిఎంఓ వైఎస్ రాజీవ్ చెప్పారు. ఆ తర్వాత ఈ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశాలను పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు. ఫ్లిక్ బస్సు సేవలు ప్రజా రవాణా రంగంలో ఓ విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుడతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.