దేశంలో పెద్ద నోట్ల రద్దు జరిగి ఈ ఏడాది జూన్ – జూలై నాటికి.. తొమ్మిదేళ్లు అవుతుంది. అవినీతి, అక్రమాలు, లంచాలు, ఎన్నికల్లో ఓటర్ల కొనుగోలు ప్రక్రియలు వంటివాటికి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో 2016 లో మోడీ ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత.. వాటి స్థానంలో మరింత పెద్ద నోట్లను తీసుకు వచ్చారు. అదే 2000 నోటు. వీటిపై తీవ్ర విమర్శలు రావడంతోపాటు.. అవినీతిమరింత పెరిగిందన్న నిఘా విభాగాల సూచనతో రెండేళ్ల కిందటే.. ఈ నోట్లను రద్దు చేశారు.
ఇక, ఆ తర్వాత.. 2000 నోటు చలామణిలో ఉంచడం కాదు.. అసలు ఈ నోటు జేబులో ఉంటేనే క్రిమినల్ కేసు పెట్టేలా ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో రాత్రికి రాత్రి సాధారణ ప్రజలు రూ.2000 నోట్లను బ్యాంకులకు జమ చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2000 నోటును సాధారణ ప్రజలు దాదాపు మరిచిపోయారు. అయితే.. తాజాగా ఆర్బీఐ.. సరికొత్త లెక్క చెప్పింది. 2000 నోట్లను కొందరు దాచేశారని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 31 నాటికి(అంటే రెండు కిందటి వరకు) దేశంలో 6,577 కోట్ల రూపాయల విలువైన 2000 నోట్లు ప్రజల్లోనే ఉన్నాయని పేర్కొంది.
ఏ నోటును ముద్రించినా.. ఎన్ని ముద్రించామన్న లెక్క ఆర్బీఐ దగ్గర ఉంటుంది. దీని ప్రకారం.. 2016లో ముద్రించిన 2000 నోట్ల లెక్క ప్రకారం.. ఈ విషయం వెల్లడైనట్టు వివరించింది. అంటే.. ఇప్పటికీ 6,577 కోట్ల రూపాయల విలువైన నోట్లను కొందరు దాచేసినట్టు లెక్క తేలింది. దీంతో ఈ విషయంపై ఐటీ శాఖ దృష్టి పెట్టింది. గతంలో దాడులు జరిగినప్పుడు.. ఎవరి వద్ద అయితే.. పేద్ద ఎత్తున నగదు పట్టుబడిందో వారిపైనే మరోసారి దృష్టి పెట్టేందుకు సిద్ధమైందని తెలుస్తోంది.
మే 2023లో చెలామణిలో ఉన్న 3.56 లక్షల కోట్ల విలువైన కరెన్సీ నోట్లలో 98.15 % తిరిగి వ్యవస్థలోకి వచ్చాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. మిగిలిన మొత్తం 2000 నోట్ల రూపంలో ఉందని.. దీనిని స్వాధీనం చేసుకుంటామని పేర్కొంది. ఇదిలావుంటే.. ఇటీవల తిరుమల శ్రీవారి హుండీలో 2000 నోట్ల కట్టలు ఐదు లభించడం తెలిసిందే. ఈ వ్యవహారం కలకలం రేపింది. దీంతో సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా సదరు భక్తుడిని పట్టుకోవాలని భావించినా.. తిరుమల కు చెడ్డపేరు వస్తుందని దానిని వాయిదా వేశారు.