ఇంత జాలీగా వీరు ఎప్పుడూ కనిపించలేదు

ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో… భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన సాంకేతిక నిపుణుడు… ప్రపంచ శ్రేణి సాఫ్ట్ వేర్ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఇంకొకరేమో… ప్రపంచంలోనే అగ్ర దేశాలుగా విరాజిల్లుతున్న వాటిలో ఓ దేశానికి ఏకంగా ప్రధాన మంత్రిగా పని చేసిన వారు.

అంతేనా… ఆ చివరన బాలీవుడ్ నే కాకుండా యావత్తు భారత సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న సూపర్ స్టార్. ఆయన పక్కనే బాలీవుడ్ లో పేరు మోసిన హీరోగా గుర్తింపు అందుకున్న ఆయన కుమారుడు.

ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెరుగుతుంది. ఇప్పుడు ప్రస్తావించిన పేర్లన్నీ లైవ్ టీవీలో అలా కనిపించి ఇలా మాయమైన ముఖాలు మాత్రమే. ఇంకా కనిపించకుండా..అక్కడ కూర్చున్న ప్రముఖులు ఇంకెంత మంది ఉన్నారో చెప్పడం కష్టమే.

వీరంతా ఏ కార్యక్రమానికి వచ్చారు అంటారా? భారత్ లో ఇంగ్లండ్ జట్టు పర్యటిస్తోంది కదా. రెండు దేశాల మధ్య జరుగుతున్న 5 మ్యాచుల టీ20 సీరిస్ లో చివరి మ్యాచ్ ఆదివారం ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు వీరంతా వచ్చారు.

వీరంతా ఎవరన్న విషయానికి వస్తే… ఆ కుబేరుడేమో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ. ఇక ఆ సాంకేతిక నిఫుణుడు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి. ఇంగ్లండ్ మాజీ ప్రధాని రిషి సునక్. ఇక బాలీవుడ్ నటులు ఎవరంటే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్.

బచ్చన్ లు జనం మధ్య నిలబడి కేరింతలు కొడితే.. మిగిలిన వారంతా వారిలో వారే కబుర్లు చెప్పుకుంటూ ఉల్లాసంగా కాలక్షేపం చేశారు. నిత్యం బిజీ షెడ్యూల్ తో సాగే వీరంతా ఇంత లీజర్ గా గతంలో ఎప్పుడూ కనిపించలేదు. అంతేకాకుండా అంబానీ, మూర్తి, సునక్..ఒకే చోట కూర్చుని ముచ్చటించుకున్న దృశ్యం ఇప్పటిదాకా కనిపించనే లేదు. అన్నట్లు మూర్తికి సునక్ అల్లుడన్న విషయం తెలిసిందే కదా.

అయినా ఈ మ్యాచ్ కు ఇంత ప్రాధాన్యం ఉందా? అంటే… అస్సలే లేదని చెప్పాలి. ఓ రంజీ మ్యాచ్ కు ఉన్నంత ప్రాధాన్యం కూడా లేదు. ఎందుకంటే.. ఇప్పటికే ఈ సిరీస్ ను బారత్ 3-1 తేడాతో ఇప్పటికే టీమిండియా ఒడిసిపట్టేసింది. అంటే… వాంఖడే మ్యాచ్ ఇరు జట్లకు ప్రాక్టీస్ మ్యాచ్ తో సమానం.

అయినా కూడా ఇంత మంది ప్రముఖులు వచ్చారేంటి అనుకుంటున్నారా? ఏమీ లేదండి ఆదివారం కదా. వీకెండ్. పొద్దంతా ఇంటి పట్టునే ఉన్నారు. ఈవెనింగ్ కాగానే..ఎలాగూ మ్యాచ్ ఉంది కదా అని వీరంతా అలా వాంఖడేకు వచ్చి కూర్చున్నారు.