ముచ్చటైన జంట. ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. భార్యా భర్త ఇరువురూ ఉద్యోగాలు చేసుకుంటూ.. ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. కానీ విధి విలాసం.. విధులపై వేరే ప్రాంతానికి వెళ్లిన భార్య.. విమానంలో తిరిగి వస్తూ.. మరో 20 నిమిషాల్లో మీ చెంతనే ఉంటానంటూ మెసేజ్ చేసిన మరికొద్ది సేపటికే.. అంతుచిక్కని విషాదంలో కన్నుమూసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను, కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది.
అమెరికాలో గత నెలలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో భారత యువతి జీవితం కూడా ముగిసిపోయింది. ప్రమాదాలు సర్వసాధారణమై పోయిన ఈ రోజుల్లో.. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్నరొనాల్డ్ రీగన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సమీపంలో జరిగిన ప్రమాదం మాత్రం అందిరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా(అధికారిక కథనం మేరకు) ల్యాండ్ అవుతున్న అమెరికన్ ఎయిర్‌వేస్ ప్రాంతీయ జెట్ విమానం.. ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇరు వాహనాలు పూర్తిగా కుప్పకూలి బూడిదయ్యాయి.
ఇదే విమానంలో విధుల నిమిత్తం విచిత అనే ప్రాంతానికి వెళ్లిన భారతి యువతి అష్రాహుస్సేన్ రజా(26) వాష్టింగ్టన్‌కు తిరిగి వస్తున్నారు. మరో 20 నిమిషాల్లో వాషింగ్టన్ చేరుకుంటానని కూడా ఆమె భర్తకు మెసేజ్ చేశారు. కానీ, ఇంతలోనే ఘోర ప్రమాదంలో కన్నుమూశారు. అయితే.. రజా తన కుటుంబంతో అటు అత్తింటి వారు.. ఇటు పుట్టింటివారితోనూ పాలు తేనె మాదిరిగా కలిసిపోయింది. దీంతో ఆమె మరణాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు.
భారత సంతతికి చెందిన రజా.. ఇండియానా విశ్వవిద్యాలయంలో చదుకుంది. ఇక్కడే పరిచయమైన హమద్‌ను 2023లో ప్రేమ వివాహం చేసుకుంది. వీరి కాపురం సుఖంగా సాగుతున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడంతో ఇరు కుటుంబాలు కన్నీటి పర్యంతమవుతున్నాయి. కాగా, రజా.. ఇక ఆసుపత్రికోసం టర్నరౌండ్ ప్రాజెక్టులో పని చేస్తున్నారు. ఈ పని కోసమే తరచుగా.. విచితకు వెళ్లి వస్తుంటారని.. కన్నీటి సుడుల మధ్య ఆమె మామ.. డాక్టర్ హషీమ్ పేర్కొన్నారు. ఎన్నో దుర్ఘటనలు జరిగినా.. ఇలాంటి ఘటన ఎప్పుడూ తన జీవితంలో చూడలేదని కన్నీటి పర్యంతమయ్యారు.