ఆంధ్రా అమ్మాయి కోసం నిర్భయ న్యాయవాది

ఇండియాలో ఎక్కడైనా అమ్మాయిపై అత్యాచారం జరిగి ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోతే జనాల్లో ఆగ్రహం పెల్లుబుకుతుంది. సోషల్ మీడియాలో కొన్ని రోజులు వీరావేశంతో స్పందిస్తారు అందరూ. కానీ ఆ తర్వాత అంతా మరిచిపోతారు. ప్రభుత్వాలు కూడా ఆ వేడి ఉన్నంత వరకు ఏదో చేసేస్తున్నట్లు కలరింగ్ ఇస్తాయి. ఆ తర్వాత కేసును నీరుగార్చేస్తుంటాయి.

నిర్భయ, దిశ లాంటి కొందరి విషయంలో మాత్రమే సత్వర చర్యలు చోటు చేసుకున్నాయి. చాలా కేసులు చరిత్రలో కలిసిపోయాయి. నిందితులు ఏ ఇబ్బందీ లేకుండా స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కర్నూలులో సుగాలి ప్రీతి అనే పేద అమ్మాయిని రేప్ చేసి ఆమె చావుకు కార‌ణ‌మైన వాళ్ల‌ను ఇప్ప‌టిదాకా శిక్షించ‌లేదు. ఈ దారుణం జరిగి మూడేళ్లు దాటిపోయింది. ఈ ఉదంతంపై అప్ప‌టి తెలుగుదేశం ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేదు. ఇప్ప‌టి జ‌గ‌న్ స‌ర్కారూ స్పందించ‌ట్లేదు. బాధితురాలి త‌ల్లిదండ్రులు అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నా వారికి న్యాయం జ‌ర‌గ‌డం లేదు.

బాధితురాలి కోసం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆ పార్టీ కార్యకర్తలు కొన్ని నెలల పాటు గట్టిగానే పోరాడారు. గత ఏడాది కర్నూలులో పర్యటించి ఆ అమ్మాయికి కోసం ఆందోళనలోనూ పాల్గొన్నాడు పవన్. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు అప్పట్లో జగన్ సర్కారు ప్రకటన చేసింది. కానీ ఇప్పటిదాకా కేసును సీబీఐ టేకప్ చేయలేదు. కేసులో ఏ పురోగతీ లేదు. ఐతే తన కూతురికి న్యాయం జరగాలని అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రీతి తల్లి తన పోరాటాన్ని తాజాగా ఢిల్లీకి తీసుకెళ్లింది. అక్కడ జంతర్‌మంతర్‌లో ధర్నా కోసం వెళ్లిన ఆమె.. ప్రఖ్యాత న్యాయవాది సీమ కౌశ్యాను కలిశారు.

నిర్భయ కేసులో బాధితురాలి తరఫున ఏళ్ల తరబడి పోరాడి, ఫీజు కూడా తీసుకోకుండా కేసును వాదించి, గెలిచి.. చివరికి నిందితులకు ఉరి శిక్ష అమలయ్యేలా చేసిన ధీశాలి సీమా. ఆమెను ప్రీతి తల్లి కలిసి తన కూతురికి జరిగిన అన్యాయం గురించి గోడు వెల్లబోసుకుంది. దీంతో కలిదిలిపోయిన సీమా.. ప్రీతి రేప్, మర్డర్ కేసును టేకప్ చేసింది. ఈ కేసును సవాలుగా తీసుకుని నిందితులైన కట్టమంచి స్కూల్ యాజమానులైన జనార్దన్ రెడ్డి,హర్షవర్ధన్ రెడ్డి,దివాకర్ రెడ్డిలకు శిక్ష పడేలా చూస్తానని ఆమె హామీ ఇచ్చినట్లు బాధిత కుటుంబం వెల్లడించింది.