భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయా రంగాల్లో విశేష ప్రతిభ కనబరచిన వారికి పద్మ అవార్డులను కేంద్ర ప్రభత్వం ప్రకటించిది. ఈ మేరకు శనివారం రాత్రి పద్మ అవార్డుల గ్రహీతల పేర్లను కేంద్రం ప్రకటించింది. ఈ జాబితాలో భారత రత్న తర్వాత అతున్నత పౌర పురస్కారంగా పరిగణిస్తున్న పద్మ విభూషణ్ అవార్డులకు తెలంగాణకు చెందిన ప్రముఖ వైద్యులు దువ్వూరు నాగేశ్వరరెడ్డితో పాటు మరో ఆరుగురు ఎంపికయ్యారు.
ఇక నందమూరి నటసింహం, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను కేంద్రం పద్మ భూషణ్ అవార్డుతో గౌరవించింది. కళల రంగంలో బాలయ్యకు ఈ అవార్డును ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. బాలయ్యతో పాటు తమిళ స్టార్ హీరో అజిత్ కు కూడా కేంద్రం పద్మ భూషణ్ అవాడ్డును ప్రకటించింది. వీరిద్దరితో పాటుగా వివిధ రంగాలకు చెందిన మరో 17 మందికి కేంద్రం పద్మ భూషణ్ అవార్డులను ప్రకటించింది. ఇక పద్మశ్రీ విభాగంలో ఏకంగా 113 మందికి అవార్డులను ప్రకటిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
పద్మ శ్రీ అవార్డుల గ్రహీతల్లో ఏపీకి చెందిన మాడుగుల నాగఫణి శర్మ ఉన్నారు. కళల రంగంలో శర్మ అవార్డుకు ఎంపిక కాగా.. ఇదే విభాగంలో ఏపీకి చెందిన మిరియాల అప్పారావుకూ అవార్డు దక్కింది.. సాహిత్యం, విద్య విభాగంలో ఏపీకి చెందిన కేఎల్ కృష్ణ, వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖిలకు పద్మ పురస్కారాలు దక్కాయి.
ఇక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగకూ పద్మశ్రీ పురస్కారం దక్కింది. తెలంగాణ కోటాలో ఈయనకు పద్మశ్రీ అవార్డు దక్కింది.