ప్రపంచ స్టాక్ మార్కెట్ పై అమెరికా కొత్త అధ్యక్షత ప్రభావం గట్టిగానే ఉంటుందని ముందు నుంచే సంకేతాలు వచ్చాయి. ఇక భారత స్టాక్ మార్కెట్ ట్రంప్ ప్రభావం గట్టిగానే పడింది. అతని రాకతో భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. వివిధ కారణాల ఎన్ని ఉన్నా కూడా ట్రంప్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. దాదాపు రూ.7 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు.
సెన్సెక్స్ ఏకంగా 1,235 పాయింట్ల మేర పతనమవగా, నిఫ్టీ 299 పాయింట్లకు పైగా కోల్పోయింది. సెన్సెక్స్ 76 వేల దిగువకు చేరుకుని 75,838 పాయింట్ల వద్ద ముగిసింది. అదే విధంగా, నిఫ్టీ 23,045 పాయింట్ల వద్ద స్థిరపడింది. మార్కెట్ మొత్తంగా అమ్మకాల ఒత్తిడికి గురై భారీగా కుదేలైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి రాజకీయాల్లో ప్రభావం చూపడం, మిత్రదేశాలైన మెక్సికో, కెనడాలపై ట్రేడ్ టారిఫ్ విధిస్తామంటూ చేసిన ప్రకటనలతో అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల ప్రభావం పడింది. భారత్ సహా ఇతర దేశాలపై కూడా టారిఫ్‌లు పెంచే అవకాశమున్నదని ట్రంప్ గతంలో చెప్పిన నేపథ్యంలో ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది.
ఇతర దేశాల్లో మార్పుల ప్రభావం దేశీయ మార్కెట్ మీద తీవ్రమైంది. ముఖ్యంగా, రిలయన్స్ ఇండస్ట్రీస్, జొమాటో వంటి ప్రధాన కంపెనీల షేర్లలో భారీ అమ్మకాలు జరిగాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు గణనీయంగా పెరగడం మార్కెట్‌ను మరింత ఒత్తిడికి గురిచేసింది. అంతర్జాతీయంగా డాలర్ బాండ్ ఈల్డ్స్ పెరుగుతుండటంతో, విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకున్నారు.
మరోవైపు, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆ సమయంలో ఆర్థిక విధానాలు ఎలా ఉండబోతున్నాయో ఇన్వెస్టర్లు ఆచితూచి పరిశీలిస్తున్నారు. దీంతో తాత్కాలికంగా పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద, ఇప్పుడు మార్కెట్ ముసురులో దాదాపు రూ.7 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైపోయింది. ఈ నష్టాలు దేశీయ పెట్టుబడిదారులకు గట్టిగా బాదేశాయి. ఇలాంటీ పరిస్థితుల్లో, మార్కెట్ స్థిరత్వం పొందడానికి నెమ్మదిగా మళ్లీ వృద్ధి దిశగా అడుగులు వేయాల్సి ఉంది.