ఎలాన్ మస్క్ : అప్పుడు ట్విట్టర్… ఇప్పుడు టిక్ టాక్…

అమెరికాలో అధ్యక్ష మార్పును ఆ దేశ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ తనకు అనుకూలంగా మార్చుకునే దిశగా తెలివిగా అడుగులు వేస్తున్నారన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లాను విశ్వవ్యాప్తం చేసే దిశగా చురుగ్గా కదులుతున్న మస్క్… ఎక్కడా కూడా వెనక్కు తగ్గని రీతిలో సాగుతున్నారు.

అమెరికా కొత్త అధ్యక్షుడిగా సోమవారం రాత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కు ఆది నుంచి వెన్నుదన్నుగా నిలిచిన మస్క్… ఈవీ వాహనాల తయారీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని ట్రంప్ తన తొలి ప్రసంగంలోనే పలికేలా చేసుకున్నారు.

ఇక అధ్యక్ష పదవి చేపట్టడానికి సరిగ్గా ఒక రోజు ముందు ట్రంప్ నోట, నుంచి ఓ కీలక ప్రకటన వెలువడింది. చైనాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ టిక్ టాక్ తిరిగి అమెరికాలోకి ఎంట్రీ ఇచ్చే దిశగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు. షార్ట్ వీడియో షేరింగ్ యాప్ గా ఉన్న టిక్ టాక్ కు ఇప్పటికీ అమెరికాలో భారీ ఆదరణ ఉంది.

ఈ క్రమంలో టిక్ టాక్ లో సగం మేర వాటాలను అమెరికా ప్రభుత్వానికి అప్పగిస్తే… టిక్ టాక్ ను అమెరికాలోకి అనుమతించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఫలితంగా బైడెన్ సర్కారు నిషేధించిన టిక్ టాక్ కు అమెరికాలోకి ట్రంప్ ఆహ్వానిస్తున్నట్లు అయ్యిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో చైనాకు చెందిన టిక్ టాక్ ను అమెరికా తిరిగి ఆహ్వానించాల్సిన అవసరం ఏముందంటూ ఎలాన్ మస్క్ తన నిరసన గళాన్ని వినిపించారు. తన గుత్తాధిపత్యంలోని ట్విట్టర్ కు చైైనాలో లెక్కలేనన్ని పరిమితులు విధించి మరీ ఆ దేశ పౌరులకు అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన మస్క్… మనమెందుకు చైనా టిక్ టాక్ ను అంత ఈజీగా అమెరికాలోకి అనుమతించాలంటూ వితండ వాదనకు దిగారు.

ఓ వైపు ట్రంప్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూనే…మరోవైపు టిక్ టాక్ కు మద్దతుగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మస్క్ వ్యతిరేకించారు. ఇక్కడే సిసలైన మస్క్ మంత్రం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

టిక్ టాక్ లో అమెరికా వాటాలు ఉంటే.. దానిని అమెరికాలోకి అనుతించేందుకు అభ్యంతరం లేదని అమెరికా సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో… టిక్ టాక్ వాటాలను చేజిక్కించుకునేందుకు మస్క్ మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా సమాచారం. అందులో బాగంగానే టిక్ టాక్ షేర్లను అమెరికా ప్రభుత్వం తీసుకుంటుందన్న ట్రంప్ వ్యాఖ్యలను ఆయన వ్యతిరేకించారు.

ఫలితంగా టిక్ టాక్ షేర్లను తీసుకునే విషయంలో అమెరికా సర్కారును వెనక్కు వెళ్లేలా చేసి…టిక్ టాక్ షేర్లను తాను కొనుగోలు చేసేందుకు వ్యూహం పన్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ట్విట్టర్ సంస్థను చేజిక్కించుకునేందుకు దాని మాతృ సంస్థతో మస్క్ నడిపిన మంత్రాంగాన్ని ఈ సందర్భంగా ఆ దేశ బిజినెస్ సర్కిళ్లు గుర్తు చేస్తున్నాయి. ట్విట్టర్ తనకు వద్దు వద్దని చెబుతూనే దానిని మస్క్ హస్తగతం చేసుకున్నారు. అంటే మస్క్ వద్దంటున్నారంటే… అది ఆయనకు కావాలని చెప్పడమే.

ఇప్పుడు కూడా టిక్ టాక్ అమెరికాలోకి ఎందుకంటూనే దానిని ఆయన చేజిక్కించుకోవడం ఖాయమేనని ఆ సర్కిళ్లు చెబుతున్నాయి. వెరసి,… టిక్ టాక్ ను అలా తిప్పి, ఇలా తిప్పి మస్క్ తన చేతుల్లోకి తీసుకోవడం ఖాయమేనన్న మాట.