పాకిస్తాన్ కు రోహిత్?.. వెళ్లక తప్పదా?

అప్పుడెప్పుడో…2008లో దాయాది దేశం పాకిస్తాన్ లో భారత క్రికెట్ జట్టు పర్యటించింది. అదే ఏడాది పాక్ ఉగ్రవాదులు ముంబై ఫై జరిపిన దాడి నేపథ్యంలో పాక్ టూర్లను బీసీసీఐ దాదాపుగా రద్దు చేసింది. త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ పాక్ లోనే జరుగుతోంది.

అయినా కూడా టీమిండియా ఆ దేశానికి వెళ్లడం లేదు. టీమిండియా ఆడే మ్యాచులను దుబాయ్ లో ప్లాన్ చేసారు. ఫలితంగా పాక్ లో అడుగుపెట్టాల్సిన అవసరం భారత క్రికెటర్లకు లేదు.

జట్టు సభ్యులు పాక్ వెళ్లాల్సిన అవసరం లేకున్నా… జట్టు కెప్టెన్ హోదాలో రోహిత్ శర్మ మాత్రం పాక్ వెళ్లక తప్పేలా లేదు. ఎందుకంటే… ఐసీసీ నిర్వహించే ఏ టోర్నీ అయినా… అందులో పాలు పంచుకునే జట్ల కెప్టెన్ లు అందరు ఓపెనింగ్ వేడుకలకు తప్పనిసరిగా హాజరు అవడం చూస్తున్నదే.

ఈ కారణం గానే భారత జట్టు కెప్టెన్ హోదాలో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలకు రోహిత్ హాజరు కావాల్సి ఉంది. అంటే… 2008 తర్వాత ఓ భారత క్రికెటర్ పాక్ గడ్డపై ఇప్పుడు అడుగుపెట్టబోతున్నాడన్న మాట.

ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానుంది. అంటే… ఫిబ్రవరి 17 గాని, లేదంటే 18న గాని ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. చాల ఏళ్ల తర్వాత పాక్ లో ఐసీసీ ఈవెంట్ జరుగుతున్ననేపథ్యంలో ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పాక్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఈ కారణంగానూ రోహిత్ తప్పనిసరిగా పాక్ కు వెళ్లక తప్పదన్న వాదన వినిపిస్తోంది.