+ “పండక్కి సెలవులు పెట్టారు. ఇప్పుడు ఎక్కడున్నారు. సరే.. ఎక్కడున్నా తక్షణమే వచ్చేయండి!“
+ “మీ సెలవులు రద్దు చేస్తున్నాం. వెంటనే పెట్టేబేడా సర్దుకుని ప్లేనెక్యేయండి!“
+ “మీ దేశంలో గడిపించి ఇక, చాలు వెంటనే బయలుదేరి రండి“
+ “ఈ నెల 20లోగా మీరిక్కడుండాలి. అంతే! మరో మాటే వద్దు! గెట్ స్టార్ట్“
— ఇవీ ఇప్పుడు అమెరికాలో పనిచేస్తున్న విదేశీయులను ఉద్దేశించి వారి వారి కంపెనీల యాజమాన్యలు పెడుతున్న ఈమెయిళ్లు. సందేశాలు. వెంటనే తిరిగి వచ్చేయాలని ఆయా యాజమాన్యాలు కోరుతున్నాయి.
దీంతో భారత్ సహా ఇతర దేశాలకు వచ్చిన వారు వెంటనే ఫ్లైట్ బాట పట్టుకుని పరుగులు పెడుతున్నారు. ఎప్పుడెప్పుడు అగ్రరాజ్యంలో అడుగు పెడతామా? అని ఎదురుచూస్తున్నారు.
ఏంటి కారణం?
ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టనున్నారు. ఆయన పగ్గాలు చేపట్టిన వెంటనే తీసుకునే తొలి నిర్ణయం విదేశీ ఉద్యోగులు, వీసాలపైనే ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎన్నికల సమయంలోనూ స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు లభించేలా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ హామీ నెరవేరాలంటే.. ఆయన వీసాలను పరిమితం చేయాల్సి ఉంటుందని ట్రంప్ మద్దతు దారులు చెబుతున్నారు. డిమాండ్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం హెచ్-1బీ వీసాలపై విదేశాల నుంచి అగ్రరాజ్యానికి వచ్చి ఉద్యోగాలు చేసుకునే వారిపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉంది. లేదా అసలు వీసాలను కూడా రద్దు చేసే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం వివిధ కారణాలతో తమ తమ దేశాలకు వెళ్లిపోయిన హెచ్-1బీ వీసాదారులు ఈ నెల 20 తర్వాత.. ఇబ్బందులు పడే అవకాశంఉందని కంపెనీలు భావిస్తున్నారు. ఈ క్రమంలో తమ వారిని తిరిగి వెంటనే అమెరికాకు వచ్చే యాలని ఆదేశాలు, సూచనలు చేస్తున్నాయి.
ఈ నెల 20 నాటికి అమెరికాలో ఉంటే.. ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పోరాడేందుకు అవకాశం ఉంటుందని.. లేదా 20 తర్వాత.. ఇప్పుడున్న వీసాతోనే అమెరికాలోకి అడుగు పెడతామంటే కుదరకపోవచ్చని కంపెనీలు చెబుతున్నాయి.
అందుకే రారండో రండో రండని.. తమ వారికి ఈమెయిళ్లు, సందేశాలు పంపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యవహారం కలకలం రేపుతుండడం గమనార్హం.