హెఎంపీవీ వైరస్…ఇండియాది, చైనాది వేర్వేరా?

కొద్ది రోజుల క్రితం వెలుగు చూసిన హెచ్ఎంపీవీ వైరస్ కు సంబంధించిన చర్చ జరుగుతోంది. చైనాలో వెలుగు చూసిన ఈ వైరస్ ప్రభావం ప్రపంచ దేశాల మీద ఎంత ఉందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. బెంగుళూరులో రెండు హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదయ్యాయని ఐసీఎంఆర్ అధికారికంగా ధృవీకరించింది.

అయితే, హెఎంపీవీ వైరస్ కొత్తదేమీ కాదని, 20 ఏళ్ల నుంచి ఇండియాతోపాటు పలు దేశాలలో అడపాదడపా ఆ కేసులు నమోదవుతుంటాయని కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి దినేశ్ గుండు చెబుతున్నారు. అయితే, చైనాలో హెచ్ఎంపీవీ వేరియంట్ కొత్తదని, భారత్ లో కనుగొన్న వేరియంట్, చైనా వేరియంట్ ఒకటా కాదా అన్నది ఇంకా తేలాల్సి ఉందని ఆయన చెప్పారు.

ఈ కొత్త వైరస్ గురించి మరిన్ని వివరాలు కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి రావాల్సి ఉందన్నారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 3, 8 నెలల వయసున్న చిన్నారుల్లో ఈ వైరస్‌ ను గుర్తించామని, ఒక చిన్నారికి వైరస్‌ తగ్గుముఖం పట్టగా.. మరొకరికి చికిత్స కొనసాగుతోందని తెలిపారు. ఆ ఇద్దరు చిన్నారులకు అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన హిస్టరీ లేదని వెల్లడించారు.

ఈ కేసులతో అలర్ట్ అయిన భారత్…డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ అధ్యక్షతన జాయింట్‌ మానిటరింగ్‌ గ్రూప్‌ మీటింగ్ నిర్వహించింది. ముందస్తు చర్యగా ఆర్‌ఎస్‌ఏ, హెచ్‌ఎంపీవీ నిర్ధారణ పరీక్షలును పలు చోట్ల నిర్వహిస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. శ్వాసకోశ వ్యాధులు అనుకోకుండా పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని డీజీహెచ్ఎస్ తెలిపింది.

కొత్త హెచ్ఎంపీవీ వేరియంట్ గురించి తెలుసుకునేందుకు చైనా ఆరోగ్య శాఖను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపింది. ఎప్పటికప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థతో టచ్ లో ఉన్నామని, ఈ కొత్త వైరస్ కు సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని, అప్రమత్తమవుతామని చెప్పింది.