ఆస్తులు మాత్రమే కావాలి. వాటిని సంపాదించి పెట్టిన తల్లిదండ్రుల్ని మాత్రం లైట్ తీసుకునే బిడ్డల సంఖ్య తక్కువేం కాదు. అలాంటి వారికి దిమ్మ తిరిగిపోయే షాకిచ్చింది దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు. గిప్ట్ డీడ్ కింద ఆస్తులు రాసి ఇచ్చిన తర్వాత తల్లిదండ్రుల సంరక్షణను విస్మరించి.. వారి బాగోగులు చూడని బిడ్డల నుంచి ఆ ఆస్తుల్నితిరిగి పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
తల్లిదండ్రులు, వృద్ధుల నిర్వహణ(పోషణ), సంక్షేమ చట్టానికి ఆ పవర్ ఉంటుందని స్పష్టం చేశారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీటీ రవికుమార్.. జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం. మధ్యప్రదేశ్ లోని చిత్తార్ పూర్ కు చెందిన పెద్ద వయస్కులైన తల్లిదండ్రులు తమ కొడుక్కి ఆస్తిలో కొంత భాగాన్ని గిఫ్టు డీడ్ రూపంలో బదిలీ చేశారు. ఆస్తి తీసుకున్న కొడుకు వారి బాగోగులు చూసుకోడు కానీ.. మిగిలిన ఆస్తిని తనకు ఇవ్వాలంటూ దాడులకు దిగాడు.
దీంతో అతడి తల్లి మొదట సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ను ఆశ్రయించారు. న్యాయం పొందారు. కొడుక్కి రాసిచ్చిన గిఫ్టు డీడ్ ను రద్దు చేసి ఆస్తిపై వృద్ధ దంపతుల హక్కులను పునరుద్దరించారు. దీనిపై కొడుకు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సింగిల్ బెంచ్ వృధ్య దంపతులకు న్యాయం చేసినా.. డివిజన్ బెంచ్ మాత్రం గిఫ్టు డీడ్ రద్దు సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వృద్ధ దంపతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం.. చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం పెద్ద వయస్కుల బాగోగుల్ని పట్టించుకోని పిల్లలకు ఇచ్చిన గిఫ్టు డీడ్ దానంతట అదే రద్దు అవుతుందని స్పష్టం చేసింది. అంతేకాదు.. కొడుక్కి ఇచచిన ఆస్తిని వారి పేరుతో పునరుద్దరించటమే కాదు.. వచ్చే నెలాఖరు నాటికి ఆస్తి బదలాయింపు జరగాలని ఆదేశించింది. తల్లిదండ్రుల ఆస్తి మాత్రమే కావాలి.. వారి బాగోగులు చూసుకోలేమన్న వారికి తన తీర్పుతో సరైన రీతిలో బుద్ధి చెప్పిందన్న అభిప్రాయం వ్యక్తవుతోంది.