తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. దర్శనం విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. “ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని వచ్చే భక్తుల కోసం శ్రీవారి దర్శనం కనీసం నిమిషం కూడా కల్పించలేమా?” అని ప్రశ్నించిన ఆయన.. ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలని అప్పటి ఈవోను ఆదేశించారు. దీంతో ఒక నిమిషం సేపు శ్రీవారిని దర్శించుకునేలా ఈవో నిర్ణయించారు.
ఈ క్రమంలోనే క్యూ లైన్ల స్థానంలో కాంప్లెక్సులు వచ్చాయి. అంటే.. దర్శనం కనీసం ఒక్క నిమిషం అయినా.. కల్పించాలంటే భారీ సంఖ్యలో వచ్చేవారిని అలా నిలబెట్టకుండా.. కూర్చోబెట్టాలని, ఆలస్యమైనా.. ఫర్వాలేదు.. అయ్యవారిని ఆసాంతం దర్శించేలా చేయాలన్న బృహత్ సంకల్పంతో కాంప్లెక్సులు నిర్మించి.. ‘నిమిషం’ నిబంధనను అమలు చేశారు. ఇది కొన్నాళ్లు అమలైంది. అయితే.. భక్తుల రద్దీ పెరిగిపోవడం.. తర్వాత.. ప్రభుత్వాలు మారడంతో ఈ నిర్ణయం బుట్టదాఖలైంది.
తర్వాత..వీఐపీ సంస్కృతికి పెద్దపీట పడింది. ఇక, ఇప్పుడు శ్రీవారు ఎవరిని కరుణించాలన్నా.. 30-35 సెకనుల మధ్యే! అంతే.. సమయంలో స్వామి వారి ముందు సామాన్యుడి దండాలు.. మొక్కులు ఉంటా యి. ఇంతకు మించి.. ఏ ఒక్క సామాన్యుడు(300 పెట్టి టికెట్ కొన్నా కూడా) కూడా శ్రీవారి ముందు మోకరిల్లే సమయం లేనే లేదు. ఇది రాను రాను మరింత క్షీణిస్తోంది. తాజాగా టీటీడీ తీసుకున్న నిర్ణయం అయితే.. శ్రీవారి ముందు భక్తుడి నిరీక్షణా సమయం కేవలం సెకనంటే సెకనుకు పడిపోయింది.
ఆశ్చర్యంగా ఉన్నా నిజం. వచ్చే నెల సంక్రాంతి, కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని.. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని 10, 11, 12 తేదీల్లో.. శ్రీవారిని దర్శించుకునేందుకు సామాన్య భక్తుల కోసం 1.2 లక్షల టికెట్లు విడుదల చేస్తున్నారు. అంటే మూడు రోజుల్లో లక్షా 20 వేల మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. వీరంతా సామాన్యులే. ఇక, వీఐపీలు, వీవీఐపీలు ప్రత్యేకం. వీరికి వేరే కోటా ఉంటుంది. అంటే.. మొత్తంగా మూడు రోజుల్లో వచ్చే భక్తులు లక్షా 20 వేల మంది భక్తులకు శ్రీవారిదర్శనం కల్పిస్తున్నారన్న మాట.
దీనిని కొంత కాలిక్యులేట్ చేస్తే.. వచ్చే లెక్క చూద్దాం..
రోజుకు 24 గంటలు. శ్రీవారి దర్శనం లభించేది 20 గంటలు. అర్థరాత్రి 1.30 నుంచి 3.30 వరకు మూసివేస్తారు. ఇక, నైవేద్య విరామం, ఇతర సేవల విరామాల పేరిట మరో 2 గంటలు పోగా.. 20 గంటలు శ్రీవారి దర్శనం లభిస్తుందని అంచనా వేసుకుంటే.. మూడు రోజులు.. 60 గంటల పాటు శ్రీవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ లెక్కన లక్షా 20 వేల మంది భక్తులకు టికెట్లు ఇస్తే.. ఇంత మందిలో ఒక్కొక్కరికీ శ్రీవారిని దర్శించుకునే సమయం కేవలం ‘సెకను’ మాత్రమే. గంటకు 2000 మంది దర్శించుకుంటారు. అంటే.. నిమిషానికి 40 మంది. సెకను, లేదా సెకనున్నరకు ఒక్కరు! ఇదీ.. శ్రీవారి దర్శన భాగ్యం. సో.. ఆయా రోజుల్లో శ్రీవారి దర్శనం ఈషణ్మాత్రమేనన్న మాట!!