రేపు సీఎం రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటానని ప్రముఖ నిర్మాత, టీఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు అన్నారు. ఈ నేపథ్యంలోనే రేపు సీఎం రేవంత్ రెడ్డితో పలువురు సినీ ప్రముఖులతో కలిసి భేటీ కాబోతున్నామని దిల్ రాజు ప్రకటించారు. హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న టాలీవుడ్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు, ఇతర సినీ ప్రముఖులంతా కలిసి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతామని చెప్పారు.

టీఎఫ్ డీసీ తరఫున ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఈ రోజు ఉదయం కన్ఫర్మ్ అయిందని, టాలీవుడ్ ప్రముఖులకు ఫోన్ చేస్తున్నామని చెప్పారు. ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు కొనసాగేలా చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వంతో ఇండస్ట్రీ సత్సంబంధాలు కొనసాగేలా ఈ సమావేశం ఉంటుందని అన్నారు.

ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్య వారధిలా ఉంటానని తనను టీఎఫ్ డీసీ ఛైర్మన్ గా నియమించారని చెప్పారు. అల్లు అర్జున్ ను కలవలేదని, త్వరలోనే కలుస్తానని అన్నారు. రేపు సీఎంతో మీటింగ్ అయిన తర్వాత అన్ని విషయాలపై క్లారిటీ వస్తుందని అన్నారు. అల్లు అరవింద్, సుకుమార్, నిర్మాతలు రవి, నవీన్ కలిసి రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు ఇచ్చారని, అది వారి కుటుంబానికి, పిల్లల చదువులకు ఉపయోగపడేలా వారికి అందజేస్తానని తెలిపారు. ఈ రోజు కూడా శ్రీతేజ్ రికవరీ ఫాస్ట్ గా ఉంది అని…వెంటిలేటర్, ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా 72 గంటల పాటు ఉన్నాడని చెప్పారు.