వచ్చే ఏడాది పాకిస్తాన్ ఆతిథ్యంలో జరగాల్సిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఇప్పటికే తమ జట్టును పాకిస్తాన్‌కు పంపించబోమని స్పష్టమైన ప్రకటన చేసింది. ఈ పరిస్థితుల్లో టోర్నమెంట్ నిర్వహణపై ఐసీసీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు కొనసాగిస్తున్నాయి. కానీ పాకిస్థాన్ తన వైఖరిని పూర్తి స్థాయిలో వెల్లడించకపోవడంతో సమస్యలు సద్దుమణగడంలేదు.
ఐసీసీ హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనను పీసీబీకి సమర్పించినప్పటికీ, దీనిపై ఇంకా నిర్ణయం వెలువడలేదు. టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య జరుగుతుందని ఊహిస్తున్నప్పటికీ, షెడ్యూల్ ఖరారు ఆలస్యం అవుతుండడం టోర్నమెంట్ నిర్వహణపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. బ్రాడ్‌కాస్టర్‌లు, స్పాన్సర్‌లు ఈ అస్పష్టత వల్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, టోర్నీ ఫార్మాట్‌పై కీలక మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. వన్డే ఫార్మాట్‌లో కాకుండా, టీ20 ఫార్మాట్‌లో టోర్నమెంట్ నిర్వహించడంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 50 ఓవర్ ఫార్మాట్‌కు ఆదరణ తగ్గుతూ ఉండటం, టీ20 ఫార్మాట్‌లో మార్కెటింగ్ సులభతరం అవుతుందని భావిస్తున్న బ్రాడ్‌కాస్టర్‌లు ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. దీనిపై ఐసీసీ కూడా పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు ఐసీసీకి పెద్ద సవాలుగా మారాయి. వేగంగా నిర్ణయం తీసుకోకపోతే టోర్నమెంట్ నిర్వహణలో మరింత అనిశ్చితి నెలకొనే అవకాశం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates