ప్రపంచ వ్యాప్తంగా రిటైల్ చైన్‌ను నడుపుతున్న ప్రముఖ వ్యాపార దిగ్గజ సంస్థ వాల్ మార్ట్. ఈ స్టోర్స్‌లో లభించని వస్తువు అంటూ ఏమీ ఉండదు. తిండి నుంచి బట్టల వరకు.. గృహోపకరణాల నుంచి బంగారు ఆభరణాల వరకు కూడా వాల్ మార్ట్‌లో లభిస్తాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మెజారిటీ దేశాల్లో రిటైల్ ఔట్‌లెట్లను విస్తృతంగా ఏర్పాటు చేశారు. బహిరంగ మార్కెట్ కంటే కూడా.. ఎంతో కొంత చౌకకు వస్తువులు లభించడంతో ప్రజలు కూడా వాల్ మార్ట్‌కుఅలవాటు పడ్డారు. ఇక, భారత దేశానికి వచ్చే సరికి కాంగ్రెస్ హయాంలో కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున ఉద్యమించి..వాల్ మార్ట్‌ను అడ్డుకున్నారు.
స్తానిక వ్యాపారాలు దెబ్బతింటాయని, ఉద్యోగాలు.. పోతాయని, వ్యాపారులు రోడ్డున పడతారని పేర్కొంటూ అడ్డుకున్నారు. అయితే.. మోడీ సర్కారు వచ్చిన తర్వాత.. నెమ్మదిగా మన దేశంలోనూ వాల్ మార్ట్ విస్తృతంగా ఔట్‌లెట్లను ఏర్పాటు చేసింది. ఇక, ఆన్‌లైన్ ద్వారా కూడా పెద్ద ఎత్తున వ్యాపారాలు సాగుతున్నాయి. అయితే.. తాజాగా విశ్వహిందూ పరిషత్ సహా.. ఆర్ ఎస్ ఎస్ లు ఈ సంస్థను భారత్ నుంచి తరిమి వేయాలంటూ.. ప్రతిపాదనలు చేయడం.. నేరుగా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాయడం సంచలనం సృష్టించింది. హిందువుల మనోభావాలను ఈ సంస్త దెబ్బతీసిందన్నది ఆయా సంస్థలు చెబుతున్న మాట. దీంతో ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనూఈ వ్యవహారం హాట్ టాపిక్ అయింది.
ఎందుకు?
వాల్ మార్ట్ రిటైల్ ఆన్‌లైన్ షాపుల్లో లభించే వస్తువులపై హిందువుల బోమ్మలు ముద్రించారు. సహజంగా మన దగ్గర కూడా.. పూజా సామగ్రి పై హిందూ దేవుళ్ల బొమ్మలువేసుకుంటాం. ఇక, ఆలయాల్లో ఇచ్చే ప్రసాదాల కవర్లపైనా బొమ్మలు ఉంటాయి. అయితే.. వాల్ మార్ట్‌కు వచ్చే సరికి మాత్రం ఆన్‌లైన్‌లో విక్రయించే చెప్పులు, పురుషులు వేసుకుని షార్ట్స్, మహిళలు ధరించే బికినీలపై హిందువుల దేవుళ్ల బొమ్మలు ముద్రించి విక్రయిస్తున్నారు. వినాయకుడు, సరస్వతీ దేవి, లక్ష్మీదేవి చిత్తరువులను ముద్రించి విక్రయిస్తుండడం పై ఆర్ ఎస్ ఎస్, విశ్వహిందూ పరిషత్‌లు నిప్పులు చెరిగాయి. ఇది హిందూ మతాన్ని ఉద్దేశ పూర్వంగా అవమానించడమేనని.. పేర్కొన్నాయి.
హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న విదేశీ కంపెనీలను తక్షణమే నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి. వాల్మార్ట్ సంస్థ.. హిందువుల పట్ల, వారి మనోభావాల పట్ల ఇస్తున్న గౌరవానికి ఇది చిహ్నమని.. వీహెచ్‌పీ నేతలు దుయ్యబట్టారు. దీనిపై ప్రధానికి లేఖ రాసినట్టు చెప్పారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం ప్రధాని కోర్టుకు చేరింది. ఇప్పటికే అదానీ-అమెరికా వ్యవహారంతో తలబొప్పి కడుతున్న నేపథ్యంలో ఇప్పుడు అదే దేశానికి చెందిన వాల్ మార్ట్ వ్యవహారం మరింతగా కేంద్రాన్ని కుదిపేయనుంది. ఈ వ్యవహారాన్ని పార్లమెంటులో తేల్చుకుంటామని మహారాష్ట్రకు చెందిన ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఎంపీలు పేర్కొన్నారు.