దేశంలో బిలియనీర్ల మొత్తం ఆస్తి విలువ ఎంతో తెలుసా?

దేశంలో బిలియనీర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఈ సంఖ్య 185కు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి వాతావరణం.. యుద్ధ భయాలు.. ఆర్థిక పరిస్థితులపై అయోమయ పరిస్థితులు నెలకొన్న వేళ.. వీటితో సంబంధం లేనట్లుగా సంపన్నుల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. గడిచిన పదేళ్లలో వీరి సంపన్నుల సంపద ఏకంగా 121 శాతం పెరిగినట్లుగా స్విట్జర్లాండ్ కు చెందిన అతి పెద్ద బ్యాంక్యూబీసీ వెల్లడించింది. బిలియనీర్ల సంపదపై వార్షిక నివేదికను తాజాగా విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది.

భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య 185కు పెరిగిందని.. వీరి సంపద మొత్తం విలువ మన రూపాయిల్లో రూ.76 లక్షల కోట్లకు పైనే ఉన్నట్లు చెప్పింది. 2015లో ప్రపంచ వ్యాప్తంగా 1757 మంది కుబేరులు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 2682కు పెరిగిందని.. 2022లో అత్యధికంగా 2686గా ఉన్నట్లు వెల్లడించింది. ఈ పదేళ్లలో కుబేరుల సంపద మొత్తం విలువ 6.3 ట్రిలియన్ డాలర్ల నుంచి 14 ట్రిలియన్ డాలర్లకు పెరిగినట్లుగా పేర్కొంది.

టెక్ బిలియనీర్ల సంపద శరవేగంగా పెరిగిందని.. 2015లో వీరి సంపద 788.9 బిలియన్ డాలర్లు కాగా.. ఈ ఏడాది 2.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని.. ఈ జాబితాలో పారిశ్రామికవేత్తలు ఉన్నట్లు తెలిపింది. 2015-20 మధ్య చైనా బిలియనీర్ల సంపద 887.3 బిలియన్ డాలర్ల నుంచి 2.1 ట్రిలియన్ డాలర్లకు పెరిగిందని.. ఆ తర్వాత నుంచి వీరి ఆస్తి తగ్గుతున్నట్లుగా పేర్కొంది. ప్రస్తుతం వీరి సంపద విలువ 1.8 ట్రిలియన్ డాలర్లు కావటం గమనార్హం.

ఈ ఏడాది కొత్తగా 268 మంది బిలియనీర్లు లిస్టులో చేరారని.. వీరిలో 60 శాతం మంది వ్యాపార వ్యవస్థాపకులేనని చెప్పింది. అమెరికా కుబేరుల సంపద విలువ 27.6 శాతం పెరిగి 5.8 ట్రిలియన్ డాలర్లుగా లెక్క కట్టింది. 2024లో చైనా, హాంకాంగ్ లో బిలియనీర్ల సంఖ్య 588 నుంచి 501కు తగ్గటం గమనార్హం. భారత్ లో మాత్రం బిలియనీర్ల సంఖ్య పెరిగింది. 2024లో 153 మంది నుంచి 185 మందికి పెరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో బిలియనీర్ల సంపద 39.5 శాతం పెరిగి 138.7 బిలియన్ డాలర్లుగా ఉననట్లు రిపోర్టు వెల్లడించింది.