భార‌త్‌ గ్రేట్.. ఒక్క‌రోజులో 6.4 కోట్ల ఓట్ల లెక్కింపా: షాక్ అయిన ముస్క్!

భార‌త ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌, ఎన్నిక‌ల సంఘం ప‌నితీరుపై ప్ర‌పంచ కుబేరుడు, టెస్లా అధినేత‌ ఎలాన్ మ‌స్క్‌.. సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గుర‌య్యారు. తాజాగా మహారాష్ట్ర‌, జార్ఖండ్ స‌హా.. ప‌లు రాష్ట్రాల్లో జరిగిన ఉప్ప ఎన్ని కల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ఒకే రోజు(శ‌నివారం)లో పూర్త‌యిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని కోట్ చేస్తూ.. మ‌స్క్ నివ్వెర పోయారు. అదే స‌మ‌యంలో ప్ర‌శంసించారు కూడా.

రెండు రాష్ట్రాల్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌లు, ఉప ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపును ఒకే రోజులో పూర్తి చేయ‌డం గ్రేట్ అని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ స‌మ‌యంలోనే అమెరికాలో జ‌రిగిన అధ్య‌క్ష ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌ను ప్ర‌స్తావించారు. ఇప్ప‌టికీ అమెరికాలో లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగుతోంద‌ని తెలిపారు. కాలిఫోర్నియాలో ఇప్ప‌టికీ ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ జ‌రుగుతూనే ఉంద‌న్నారు. అమెరికాతో పోల్చుకుంటే.. భార‌త్ గ్రేట్ అని వ్యాఖ్యానించారు.

“భార‌త్‌లో 6.4 కోట్ల మంది వేసిన ఓట్ల‌ను ఒక్క రోజులోనే లెక్కించేశారు. కాలిఫోర్నియాలో ఇప్ప‌టికీ లెక్కింపు జ‌రుగుతూనే ఉంది“ అని ఎక్స్‌లో మ‌స్క్ రాసుకొచ్చారు. దీనికి భార‌త ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపుపై వ‌చ్చిన ఓ ఆర్టిక‌ల్‌ను(640 మిలియ‌న్ల ఓట్ల‌ను భార‌త్ ఒక్క రోజులో ఎలా లెక్కించింది) కూడా జ‌త చేశారు. ఈ పోస్టుకు మ‌రో క్యాప్ష‌న్ కూడా జోడించారు. ఈ పోస్ట్‌కి “అయితే భారతదేశంలో, మోసం చేయడం వారి ఎన్నికల ప్రధాన లక్ష్యం కాదు” అని శీర్షిక పెట్టారు.

మ‌రోపోస్టుకు కూడా మ‌స్క్ స్పందించారు. “భార‌త్ 640 మిలియ‌న్ల ఓట్ల‌ను ఒకే ఒక్క రోజులో లెక్కిస్తే.. కాలిఫోర్నియాలో 1.5 కోట్ల ఓట్ల‌ను గ‌త 18 రోజులుగా లెక్కిస్తూనే ఉన్నారు“ అని కామెంట్ చేశారు. ఇప్ప‌టికి రెండు వారాలు పూర్త‌యినా 3 ల‌క్ష‌ల ఓట్ల‌ను ఇంకా లెక్కించాల్సి ఉంది. ఇక్క‌డ బ్యాలెట్ పేప‌ర్ ప‌ద్ధ‌తిలో ఓట్లు వేశారు.