కరోనా గోడ కూలిపోయింది

కరోనా వ్యాప్తి భయంతో ఆంధ్రప్రదేశ్ నుంచి రాకపోకల్ని ఆపేస్తూ తమిళనాడు బోర్డర్లో ఆ రాష్ట్ర వాసులు గోడ నిర్మించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల కిందటే కొన్ని చోట్ల అంతర్ రాష్ట్ర సరిహద్దుల్ని తమిళనాడు మూసేసింది.

ఐతే చిత్తూరు జిల్లా నుంచి వేలూరు సీఎంసీ ఆసుపత్రికి అత్యవసర సేవల కోసం రోగులు రావడం పరిపాటి. దీంతో చిత్తూరు-వేలూరు మార్గంలో రోడ్డును తెరిచే ఉంచుతున్నారు. ఐతే ఏపీ నుంచి కరోనాను జనాలు తమ ప్రాంతానికి మోసుకొస్తున్నారన్న భయంతో ఆ మార్గాన్ని మూసి వేస్తూ తాత్కాలికంగా సిమెంటు దిమ్మెలతో గోడ కట్టేశారు.

దీనిపై చిత్తూరు జిల్లా వాసులపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సీఎంసీలో సగం కేసులు చిత్తూరు జిల్లా వాసులవే ఉంటాయి. నామమాత్రపు రుసుముతో పెద్ద పెద్ద జబ్బులకు కూడా చికిత్స అందిస్తుందా ఆసుపత్రి.

దాన్ని నమ్ముకున్న వాళ్లందరూ ఇలా గోడ కట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొందరు చిత్తూరు వాసులు ఆ గోడను కూలగొట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీనిపై ఏపీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా వ్యవహారంపై జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

ఆయన వేలూరు జిల్లా కలెక్టర్ షణ్ముఖ సుందరంతో మాట్లాడారు. గోడను తొలగించకపోతే చిత్తూరు జిల్లా సహ రాయలసీమ వాసులు చాలా ఇబ్బంది పడతారని, అత్యవసర కేసుల్ని దృష్టిలో ఉంచుకుని ఆ గోడను తొలగించాలని కోరారు.

దీంతో వేలూరు కలెక్టర పెద్ద మనసుతో స్పందించారు. వెంటనే అధికారుల్ని పంపించి ఆ గోడను కూలగొట్టించారు. దీంతో రాకపోకలు సాగుతున్నాయి. ఐతే అక్కడే చెక్ పోస్టు ఏర్పాటు చేసి ఆసుపత్రిలో అత్యవసర సేవల కోసం వెళ్లే వాళ్లను మాత్రమే చూసి అనుమతిస్తున్నారు ప్రభుత్వ సిబ్బంది.