భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. సమీపంలోనే జరగబోయే మూడు ఐపీఎల్ సీజన్ల తేదీలను ముందుగానే ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. శుక్రవారం ఉదయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 14, 2025 (శుక్రవారం) నుంచి మే 25, 2025 (ఆదివారం) వరకు జరగనుంది.
అంతేకాదు, 2026 మరియు 2027 సీజన్ల తేదీలను కూడా వెల్లడించింది. 2026 సీజన్ మార్చి 15 నుంచి మే 31 వరకు, 2027 సీజన్ మార్చి 14 నుంచి మే 30 వరకు జరుగుతుందని పేర్కొంది. ఈ వివరాలను సంబంధిత ఫ్రాంచైజీలకు బీసీసీఐ అధికారికంగా తెలియజేసింది. ఇప్పటివరకు ఐపీఎల్ తేదీల ప్రకటన సాధారణంగా చివరి నిమిషం వరకు వాయిదా పడేది. గతంలో క్రికెట్ షెడ్యూల్స్, అంతర్జాతీయ టోర్నమెంట్ల కారణంగా ఐపీఎల్ షెడ్యూలింగ్ పై అనేక సవాళ్లు తలెత్తాయి.
కానీ ఈసారి ఏకంగా మూడు సీజన్ల తేదీలను ముందుగానే ప్రకటించడం విశేషంగా మారింది. ఇంత ముందుగానే తేదీలు ప్రకటించడం వెనుక ప్రధాన కారణం బీసీసీఐ ముందుచూపు అనేది స్పష్టమవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్‌కు లోబడి, ఐపీఎల్ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇది ఫ్రాంచైజీలకు మాత్రమే కాకుండా అభిమానులకు కూడా గుడ్ న్యూస్ గా మారింది. ఈ ప్రకటనపై క్రికెట్ విశ్లేషకులు పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ కోసం ముందస్తు ప్రణాళికలు మంచి విషయమే అని, దేశవాళీ క్రికెట్ టోర్నీ షెడ్యూల్స్ కూడా క్లాష్ అవ్వకుండా ఉంటాయని అంటున్నారు.