క్రికెట్ చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ ను అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు. ప్రత్యర్థి బౌలర్లకు నిద్రలేకుండా చేసిన ఈ అగ్రశ్రేణి బ్యాటర్, తన దూకుడు స్టైల్‌తో అభిమానుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అలాంటి ఆటగాడు భారత జట్టులో మళ్ళీ కనిపించలేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు వీరు వారసుడు ఆర్యవీర్ సెహ్వాగ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాడు.
తాజాగా కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆడిన ఆర్యవీర్ సెహ్వాగ్, మేఘాలయపై అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో మెరిసిన ఆర్యవీర్ మొత్తం 229 బంతులు ఎదుర్కొని 200 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో రెండు సిక్సర్లు, ఏకంగా 34 బౌండరీలు ఉండటం విశేషం. ఫోర్లు, సిక్సుల ద్వారా మాత్రమే 148 పరుగులు సాధించిన ఆర్యవీర్ తన అటాక్ మూడ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఆర్యవీర్ బ్యాటింగ్ చూసి తండ్రికి తగ్గ తనయుడు అని అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సెహ్వాగ్ తరహా దూకుడు ఆటను ఆర్యవీర్ ప్రదర్శించడంతో, అతనికి భవిష్యత్తులో టీమిండియాలో స్థానం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. యువ ఆటగాడి గేమ్ మేచ్యూరిటీని చూసి, అతని ప్రదర్శనల పట్ల క్రికెట్ విశ్లేషకులు కూడా ఆసక్తిగా ఉన్నారు.
ఈ ఫీట్‌తో అభిమానులు ఒక్కసారిగా ఆర్యవీర్‌పై ఆశలు పెట్టుకున్నారు. తన తండ్రిలాగే టీమిండియాకు సేవలందించాలని కోరుకుంటున్నారు. కేవలం 17 ఏళ్ల వయసులోనే ఇటువంటి ప్రదర్శన కనబరచిన ఆర్యవీర్, తన కెరీర్‌లో మరిన్ని ఘనతలను సాధించడానికి సిద్ధంగా ఉన్నాడని భావిస్తున్నారు. సెహ్వాగ్ వారసుడి ప్రతిభ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా, సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ తన తొలి డబుల్ సెంచరీతో క్రికెట్‌లో తన ప్రత్యేకతను చాటిచెప్పాడు. మరి తండ్రికి తగ్గ తనయుడిగా క్రికెట్ రంగంలో గుర్తింపు అందుకుంటాడో లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates