గంభీర్‌కు ఆఖరి అవకాశం

గంభీర్ కోచ్ గా KKK జట్టుకు అందించిన విజయాలు అందరిని ఎంతగానో ఎట్రాక్ట్ చేశాయి. అతను ఏది చెబితే అది ఫైనల్ అనేలా ఆ జట్టు నడుచుకుంది. ఒక డిక్టేటర్ తరహాలోనే అతను కొనసాగారు. ఆ దూకుడుతో అతని ఐడియాలు బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ క్రమంలో భారత జట్టుకు అతను గురువుగా ఉండడం పర్ఫెక్ట్ అని ఫ్యాన్స్ సైతం కూడా కోరుకున్నారు. అయితే టీ20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియమితుడయ్యాడు.

శ్రీలంకపై టీ20 సిరీస్ గెలిచినప్పటికీ, వన్డే సిరీస్ కోల్పోయింది. ఆపై బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ విజయంతో మంచి ఆరంభం ఇచ్చినా, న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ 0-3 తేడాతో పరాజయం పాలై వైట్‌వాష్‌కు గురైంది. గంభీర్‌ పై భారీ అంచనాలు ఉండగా, ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానుల్లో నిరాశ నెలకొంది. ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్, వన్డే ప్రపంచకప్ గెలిచేందుకు భారత్ యత్నిస్తున్న నేపథ్యంలో, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశాలు మందగించాయి.

ఒక విధంగా గంభీర్ కోసం బీసీసీఐ మరింత స్వేచ్ఛను ఇచ్చింది. గతంలో రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్‌లకు ఇవ్వని అవకాశం గంభీర్‌కు లభించింది. కానీ ఈ ఓటమితో ఆ స్వేచ్ఛ కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. భారత జట్టు ఎంపిక సమావేశాల్లో ప్రధాన కోచ్ సాధారణంగా పాల్గొనరు. అయితే గంభీర్ కోసం ఈ నియమాన్ని బీసీసీఐ మార్చడం చర్చనీయాంశమైంది. ఆసీస్ పర్యటనకు వెళ్లే జట్టును ఎంపిక చేయడంలో గంభీర్‌కు పూర్తిగా స్వేచ్ఛ కల్పించిందని సమాచారం. కివీస్ సిరీస్‌లో సిరాజ్‌ను నైట్‌వాచ్‌మెన్‌గా పంపడం, సర్ఫరాజ్ ఖాన్‌ను 8వ స్థానంలో ఆడించడం వంటి నిర్ణయాలపై విమర్శలు వచ్చాయి.

గంభీర్ ప్రత్యేకంగా హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డి వంటి యువ ఆటగాళ్ల ఎంపికపై తన అభిప్రాయాలను బలంగా వెల్లడించినట్లు తెలుస్తోంది. భర్తీ కోసం టాప్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య స్థానంలో నితీశ్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని గంభీర్ సూచించినట్లు సమాచారం. ఇక గంభీర్ వ్యూహాలు అనుకున్న విధంగా ఫలితాలను ఇవ్వకపోతే, బీసీసీఐ అతని అధికారాలపై పునరాలోచించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్ పోటీపడాలంటే, ఆసీస్ పర్యటనలో భారత్ మంచి ప్రదర్శన చేయాల్సి ఉంది. మరి గంభీర్ ఎలాంటి ప్రణాళికలు రచిస్తారో చూడాలి.