రిలీజ్ ముంగిట ఏమిటీ ‘నిశ్శబ్దం’?

దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులున్న నటులున్నారు. వీరికి తోడు ఓ ప్రముఖ హాలీవుడ్ నటుడు కీలక పాత్ర పోషించారు. కంటెంట్, మేకింగ్ అన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో కనిపిస్తన్నాయి. పెద్ద బడ్జెట్లోనే సినిమా తీశారు. ఇలాంటి సినిమా విడుదలకు సిద్ధమైందంటే ప్రమోషన్లు గట్టిగా చేయడం సహజం. కానీ ‘నిశ్శబ్దం’ టీం మాత్రం టైటిల్‌కు తగ్గట్లే సైలెంటుగా ఉంటుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. థియేట్రికల్ రిలీజ్ అయితే ఈ సినిమాను ఏ రేంజిలో ప్రమోట్ చేసేవారో అంచనా వేయొచ్చు. అనుష్క మీడియా ముందుకొచ్చి సందడి చేసేది. టీవీ ఛానెళ్లకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చేదేమో. కోన వెంకట్, మాధవన్, దర్శకుడు మధుకర్ కూడా ప్రమోషన్లలో బిజీగా ఉండేవాళ్లు. ఐతే ‘నిశ్శబ్దం’ను అమేజాన్ ప్రైమ్ వాళ్లకు ఇచ్చేయడం వల్లో ఏమో.. ప్రమోషన్లలో అంతగా సందడి కనిపించట్లేదు. మధుకర్ యూట్యూబ్ ఛానెళ్లలో కొన్ని ఇంటర్వ్యూలిచ్చాడు. మాధవన్ కొన్ని మీడియా సంస్థలకు ఫోన్ ఇంటర్వ్యూలిచ్చాడు. ట్విట్టర్లో ట్రైలర్, టీజర్ రిలీజ్ చేశారు.

అంతే.. అంతకుమించి ప్రమోషన్ అన్నదే లేదు. మధుకర్, మాధవన్ ఇంటర్వ్యూలో ఏమంత సెన్సేషనల్‌గా లేవు. అనుష్క అయితే అడ్రస్ లేదు. ఆమె వర్చువల్‌గా అయినా మీడియాను మీట్ కావచ్చు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వొచ్చు. లేదంటే ఫోన్ ఇంటర్వ్యూలతో అయినా సినిమాను ప్రమోట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. కానీ అలాంటివేమీ జరగట్లేదు. సినిమాకు ముఖ చిత్రం అయిన అనుష్క ప్రమోషన్లకు పూర్తంగా దూరంగా ఉండటం, యాడ్స్ లాంటివేమీ కూడా లేకపోవడంతో ‘నిశ్శబ్దం’కు విడుదల ముంగిట ఆశించిన బజ్ లేకపోయింది. ఓటీటీలకు సినిమాల్ని ఇచ్చేశాక నిర్మాతలు ప్రమోషన్లను పట్టించుకోవట్లేదన్న అభిప్రాయం బలపడుతోంది. అసలే కొత్త సినిమాలకు ఎక్కువ రేటిచ్చి తీసుకుంటుంటే అందుకు తగ్గ ఫలితం రావట్లేదని ఓటీటీలు నిరాశ వ్యక్తం చేస్తూ, రిలీజ్ తర్వాత కొంత డబ్బులు వెనక్కడిగే సంప్రదాయం మొదలవుతుంటే.. ఇలా ప్రమోషన్లు పట్టించుకోకుంటే మున్ముందు కష్టమే.