జగన్ కు పీకే.. బాబుకు రాబిన్

జగన్ కు పీకే.. బాబుకు రాబిన్

తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇప్పుడు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరించిన ఫార్మూలానే అమలు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో ఓటమితో షాక్ తగిలిన జగన్... 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచించేందుకు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ సేవలు వినియోగించుకున్నట్లుగానే... ఇప్పుడు 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు కూడా ప్రశాంత్ కిశోర్ స్నేహితుడు, అతడి జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్న రాబిన్ శర్మ సేవలను వినియోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అంటే.. జగన్ కు పీకే ఎలాగో.. చంద్రబాబుకు రాబిన్ అలాగన్నమాట.

చంద్రబాబు అండ్ కో... ఇప్పటికే రాబిన్ శర్మతో ఓ ఒప్పందం కుదుర్చుందన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. మరి టీడీపీని గెలుపు తీరాలకు చేరుస్తాడని భావిస్తున్న రాబిన్ పూర్వపరాలేమిటన్న విషయానికి వస్తే... ప్రశాంత్ కిశోర్ కు స్నేహితుడే రాబిన్ శర్మ. అంతేకాకుండా పీకే నేతృత్వంలోని సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ వంటి సంస్థల‌కు వ్యవస్థాపక సభ్యుడిగా కూడా రాబిన్ శర్మ కొనసాగుతున్నారు. అంటే... జగన్ గెలిపించిన పీకే టీంలో రాబిన్ కీలక సభ్యుడేనన్న మాట. అంతేకాకుండా సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో బీహార్ పాలిటిక్స్ లోకి పీకే ఎంట్రీ ఇస్తే... చివరాఖరులో జగన్ పనిని రాబినే భుజాన వేసుకున్నాడని కూడా ప్రచారం సాగింది.

ఇదిలా ఉంటే.. టీడీపీతో ఒప్పందం చేసుకున్న రాబిన్ శర్మ ఇప్పటికే తన బృందంతో రంగంలోకి దిగారట. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆయన తన పనిని కూడా ప్రారంభించారని ప్రచారం సాగుతోంది. రాబిన్ శర్మ గతంలో నరేంద్రమోడీ ప్రచార వ్యవహారాలను చూసుకున్నారు. రాబిన్ శర్మ పనితీరును కొద్ది రోజుల పాటు పరిశీలించిన తర్వాత వచ్చే నాలుగేళ్ల వరకూ ఆయననే వినియోగించుకోవాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల ప్రకటన, కులపరమైన రాజకీయల విభజన పరిస్థితుల్ని అధ్యయనం చేస్తున్న రాబిన్ శర్మ బృందం... త్వరలోనే దీనిపై చంద్రబాబుకు ఓ నివేదిక ఇవ్వనుందని తెలుస్తోంది.

ఆ తరువాత ప్రజల్లోకి ఏయే అంశాలపై ముందుకు సాగాలనే దానిపై ఆ టీమ్ బ్లూ ప్రింట్ రెడీ చేస్తుందని రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రజల ఆలోచనను బట్టే ఎన్నికలకు సిద్ధం కావాలని భావిస్తున్న టీడీపీ ముఖ్య నేతలు... ఈ విషయంలో అపార రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును ఒప్పించారని సమాచారం. నాలుగేళ్ల పాటు టీడీపీకి ఎన్నికల వ్యూహాలను అందించేందుకుగానూ... రాబిన్ శర్మ బృందానికి పెద్ద మొత్తంలోనే డబ్బు చెల్లించేందుకు ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది. మొత్తానికి ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ కూడా అదే బాటలో నడవాలని డిసైడయినట్టు అర్థమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English