కేసీఆర్, జ‌గ‌న్ ఒక‌టే కేట‌గిరీ.. మోడీయిజ‌మే ఏపీకి దిక్కు

తెలుగు రాష్ట్రాలలో బ‌ల‌ప‌డాల‌ని భావిస్తున్న బీజేపీ ఇందుకు త‌గిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఏపీలో ఒకింత స్లోగానే బీజేపీ గేమ్ ప్లాన్ అమ‌ల‌వుతున్న‌ప్ప‌టికీ, తెలంగాణలో మాత్రం బీజేపీ పుంజుకుంటున్న తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. స‌హ‌జంగానే బీజేపీని తెలంగాణ సీఎం కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రాజ్యాంగం మార్చాలని సీఎం కేసీఆర్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ, ఇతర పార్టీలు కేసీఆర్ పై మండిపడుతున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

రాజ్యాంగాన్ని మార్చాలని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు త‌ప్పుప‌ట్టారు. ఆ మాటలను వెంటనే తెలంగాణ సీఎం కేసీఆర్ వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ కొడుకుని, కూతుర్ని ప‌ద‌వుల్లో నుంచి దింపేస్తే స‌రిపోతుంది… రాజ్యాంగం మార్చాల్సిన అవ‌స‌రం తీరిపోతుంది అని వీర్రాజు వ్యాఖ్యానించారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ విష‌యంలో కేసీఆర్ చాలా తప్పులు మాట్లాడారని వీర్రాజు పేర్కొన్నారు. ప్ర‌ధాని మోడీ ఆధ్యాత్మిక పురుషుడు అని ఆయ‌న‌పై చేసిన వ్యాఖ్య‌లను టీఆర్ఎస్ నేత‌లు స‌మీక్షించుకోవాల‌ని సూచించారు.

రాజ్యాంగ స్ఫూర్తిని కొన‌సాగిస్తూ ఫ్యామిలీ పార్టీలకు చెక్ పెట్టేందుకు బీజేపీ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఈ సంద‌ర్భంగా సోము వీర్రాజు పేర్కొన్నారు. ఫ్యామిలీ పార్టీలను భారతదేశ రాజ‌కీయ ముఖ‌చిత్రంలో ఉంచకుండా చూసేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌న్నారు. మోడీ ఇజం ఆంధ్ర రాష్ట్రానికి అవసరం అని సోము వీర్రాజు పేర్కొన్నారు. ఆంధ్రప్ర‌దేశ్‌లో బీజేపీ, మిత్రపక్ష పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రణాళిక చేస్తున్నామ‌ని వీర్రాజు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత చేయ‌బోయే ప‌నుల గురించి సోము వీర్రాజు వెల్ల‌డించడం గ‌మ‌నార్హం