పాపం ర‌జనీ...రివ‌ర్స్ పంచ్ ఎదుర్కున్నాడు

పాపం ర‌జనీ...రివ‌ర్స్ పంచ్ ఎదుర్కున్నాడు

రాజకీయాల్లోకి అడుగుపెట్టిన‌ప్ప‌టికీ...గ‌త కొద్దికాలంగా స్త‌బ్ధుగా ఉండి...ఇటీవ‌లే దూకుడు పెంచుతున్న సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌...తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. తాను రాజకీయ పార్టీని స్థాపించి తమిళనాడులో 2021లో జరిగే ఎన్నికల్లో పోటీచేస్తానని రజనీ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అవసరమైతే తమిళ ప్రజల సంక్షేమం కోసం రజనీతో పొత్తుకు సిద్ధమని మక్కల్‌ నీధి మయం పార్టీ అధినేత కమల్‌హాసన్‌ ఇటీవల పేర్కొన్నారు. దీనికి రజనీ కూడా సానుకూలంగా స్పందించారు.

దీనికి కొన‌సాగింపుగా,  తాజాగా చెన్నైలో రజనీకాంత్‌ మీడియాతో మాట్లాడుతూ 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళప్రజలు అద్భుతాన్ని సృష్టించబోతున్నారని వ్యాఖ్యానించారు. అయితే, ఈ సినీనటుడికి రాజకీయంగా త‌క్ష‌ణ‌మే కౌంట‌ర్లు వ‌స్తున్నాయి. రజనీకాంత్ పేర్కొన్న  ఆ మహాద్భుతం రాబోయో ఎన్నికల్లో అన్నా డీఎంకే పార్టీ గెలవడమేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి పేర్కొన్నారు.

ఇటు అన్నాడీఎంకే పార్టీ సైతం ర‌జ‌నీ కామెంట్ల‌పై ఘాటుగా స్పందించింది. తమిళనాడు ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం కమల్ హసన్ తో చేయి కలుపుతామన్న వ్యాఖ్యలపై  అన్నాడీఎంకే పార్టీ కూడా మండిపడింది. మరో రెండేళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కమల్, రజనీలు కలుస్తామనడం పిల్లి, ఎలుక కలిసినట్లుందని తన అధికారిక పత్రిక ‘నమదు అమ్మ’లో తెలిపింది. అధ్యాత్మిక భావాలున్న రజనీ, హేతువాదం, కమ్యూనిజం అంశాలపై మాట్లాడుతున్న కమల్ హాసన్ లు కలసి ప్రయాణం చేయడం కష్టమని అభివర్ణించింది.

మ‌రోవైపు కమల్‌తో పొత్తుపై ర‌జ‌నీకాంత్ ఒకింత వ్యూహాత్మ‌కంగానే స్పందిస్తున్నారు. తాజా విలేక‌రుల స‌మావేశంలో క‌మ‌ల్‌తో పొత్తు పెట్టుకుంటారా? అని విలేకరులు ప్రశ్నించగా.. ఎన్నికల సమయంలోనే పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. సీఎం ఎవరు అవుతారు అన్న ప్రశ్నకు 2021లో తమిళ ప్రజలు అద్భుతాన్ని సృష్టించబోతున్నారని చెప్పారు. అప్పటివరకు ఈ విషయంపై వ్యాఖ్యానించబోనని పేర్కొన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English