కేసీఆర్‌ను వ‌రుస క‌ష్టాలు చుట్టేస్తున్నాయ్‌...

కేసీఆర్‌ను వ‌రుస క‌ష్టాలు చుట్టేస్తున్నాయ్‌...

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇటీవ‌ల వ‌రుసగా క‌ష్టాల‌పాల‌వుతున్నారు. 2014, 2018 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా  రెండుసార్లు ఘ‌న విజ‌యం సాధించి, ముఖ్య‌మంత్రి పీఠం అధిష్టించారు. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్ని పార్టీలు మ‌హాకూట‌మిగా జ‌త‌క‌ట్టి బ‌రిలోకి దిగినా.. కేసీఆర్ ఒక్క‌డే అన్నీతానై ఒంటి చేత్తే టీఆర్ ఎస్‌ను ఒంటి చేత్తో విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. అయితే ఎన్నిక‌లు ముగిసి ఏడాది కూడా గ‌డ‌వ‌క ముందే ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత వ‌చ్చిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు అధికార పార్టీ దూకుడుకు అడ్డుక‌ట్ట వేశాయి.  ఎవ‌రూ ఊహించ‌ని విధంగా టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు షాక్ ఇచ్చాయి. ఈ ఎన్నిక‌ల్లో సారు..కారు.. ప‌ద‌హారు.. నినాదంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన గులాబీ పార్టీ కేవ‌లం తొమ్మిది సీట్ల‌తోనే స‌రిపెట్టు కోవాల్సి వ‌చ్చింది. అంతేగాక ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూతురు , నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఓట మిపాల‌వ‌డం సీఎంను దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఇదిలా ఉంటే ఇటీవ‌ల చేప‌ట్టిన మంత్ర‌వ‌ర్గ విస్త‌ర‌ణ పార్టీలో క‌ల‌క‌లం రేపింది. మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌ని ప‌లువురు ఆశావాహులు ముఖ్య‌మంత్రి వైఖ‌రిపై బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేగాక ఈట‌ల రాజేంద‌ర్‌, నాయిని న‌ర్సింహారెడ్డి లాంటి సీనియ‌ర్ నేత‌లు గులాబీ పార్టీకి తాము కూడా ఓన‌ర్లేనంటూ చేసిన వ్యాఖ్య‌లు పార్టీలో ప్ర‌కంప‌న‌లు సృష్టించాయి. మొత్తానికి ఈ వివాదం స‌మ‌సిపోయిందని అనుకుంటున్న త‌రుణంలో తాజాగా ఆర్టీసీ కార్మికుల స‌మ్మె సీఎం కేసీఆర్‌కు క‌ష్టాలు తెచ్చిపెట్టింది.

రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేప‌డుతున్న స‌మ్మెకు అన్ని రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జా సంఘాలు పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. ముఖ్య‌మంత్రి కేసీఆర్ మొండి వైఖ‌రి వ‌ల్లే స‌మ‌స్య మ‌రింత జ‌ఠిలంగా మారింద‌ని ప్ర‌తిప‌క్షాల‌తోపాటు సొంత పార్టీలో కూడా నేత‌లు లోలోన అంత‌ర్మ‌ధ‌నానికి గుర‌వ‌తున్నారు. స‌మ్మె తీవ్ర రూపం దాల్చ‌డంతో హైకోర్టు క‌లుగ‌జేసుకోవ‌డం, ఆర్టీసీ కార్మికుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి, స‌మ‌స్య ప‌రిష్క‌రించుకోవాల‌ని ప్ర‌భుత్వానికి మొట్టికాయ‌లు వేయ‌డంతో సీఎం కేసీఆర్ దూకుడుకు క‌ళ్లెం వేసిన‌ట్ల‌యింది.

ఇక బీజేపీ తాజా ప‌రిణామాల‌ను క్యాష్ చేసుకుంటూ తెలంగాణ‌లో పాగా వేసేందుకు కాచుకుని కూర్చొని ఉంది. తెలంగాణ‌లో ఇత‌ర పార్టీల‌కు చెందిన నేత‌ల‌ను వ‌రుస‌గా పార్టీలో చేర్చేసుకుంటోంది. ప్ర‌తి రోజు టీఆర్ఎస్‌ను ఏదోలా ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈర‌కంగా ఇటీవ‌ల వ‌రుస‌గా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు కేసీఆర్ ప‌ట్టును స‌డ‌లేలా చేస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English