థియేటర్ల ముందు కటౌట్లు, బేనర్లు ఇక కనపడవు

థియేటర్ల ముందు కటౌట్లు, బేనర్లు ఇక కనపడవు

తమిళనాట మూడు రోజుల కిందట ఒక ఘోరం జరిగిపోయింది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పని చేసే శుభశ్రీ అనే అమ్మాయి రోడ్డు మీద స్కూటీ నడుపుకుంటూ వెళ్తుంటే.. డివైడర్ మీద స్థంభానికి కట్టి ఉన్న ఫ్లెక్సీ ఊడి స్కూటీకి అడ్డంగా పడింది. దీంతో బండి అదుపు తప్పి శుభశ్రీ రోడ్డు మీద పడిపోవడం.. వెంటనే ఓ ట్యాంక్ వచ్చి తొక్కించడం.. ఆమె దుర్మరణం పాలవడం జరిగాయి.

ఈ ఉదంతం తమిళనాాడు జనాల్ని కదిలించింది. దేశవ్యాప్తంగా ఈ ఘటన చర్చనీయాంశమైంది. రోడ్ల మీద అనుమతి లేకుండా ఎలా పడితే అలా ఫ్లెక్సీలు, బేనర్లు, కటౌట్లు ఏర్పాటు చేయడం మన దేశంలో మామూలే. తమిళనాట ఈ సంస్కృతి మరీ ఎక్కువ. ఈ ప్రమాదకర ధోరణికి వ్యతిరేకంగా తమిళనాటు ఓ పెద్దాయన అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు.

కానీ శుభశ్రీ ఉదంతంతో అందరిలోనూ కదలిక వచ్చింది. చెన్నై సహా అన్ని నగరాలు, పట్టణాల్లో అనుమతి లేని ఫ్లెక్సీలు, బేనర్లను తొలగిస్తున్నారు. జనాలు స్వచ్ఛందంగా వీటిని తొలగించే పని కూడా చేపడుతున్నారు. శుభశ్రీ ఉదంతం సినీ పరిశ్రమలో జనాల్ని కూడా కదిలించింది. ఇకపై థియేటర్ల ముందు ఫ్లెక్సీలు, బేనర్లు కట్టొద్దని.. కటౌట్లు కూడా పెట్టొద్దని స్టార్ హీరోలు ఒక్కొక్కరుగా అభిమానులకు పిలుపునిస్తున్నారు. సూర్య తన కొత్త సినిమా ‘కాప్పన్’ వేడుకలో ఈ విషయంలో మాట్లాడారు.

అభిమానులెవరూ ఈ పని చేయొద్దన్నాడు. విజయ్, అజిత్ లాంటి పెద్ద స్టార్లు కూడా అభిమానులు ఈ విషయంలో సంయమనం పాటించాలంటూ ప్రకటనలు ఇచ్చారు. కమల్ హాసన్ సైతం ‘బిగ్ బాస్’ షోలో భాగంగా ఈ ఫ్లెక్సీలు, కటౌట్ల సంస్కృతికి చరమగీతం పాడాలన్నారు. ఇండస్ట్రీ మొత్తం ఈ విషయంలో ఏకతాటిపైకి రావడం, అభిమానుల్లోనూ సానుకూల స్పందన కనిపిస్తుండటంతో థియేటర్ల ముందు బేనర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు ఇక కనిపించేలా లేవు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఒరవడిని అందిపుచ్చుకుంటే మంచిదే.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English