అక్క‌డ టీడీపీలో ఎవ‌రి దారి వారిదే..

అక్క‌డ టీడీపీలో ఎవ‌రి దారి వారిదే..

ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరి దారుణంగా తయారైన విషయం తెలిసిందే. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడంతో చాలామంది నేతలు పార్టీని వీడుతుండగా...మరికొందరు పార్టీలో ఉంటూనే అధిష్టానంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిణామలే పార్టీకి ఇబ్బందిగా ఉన్నాయనుకుంటే...వైసీపీ ప్రభుత్వం టీడీపీని అన్నివైపుల నుంచి టార్గెట్ చేస్తూ ముప్పుతిప్పలు పెడుతోంది. ఇలాంటి తరుణంలో కలిసికట్టుగా పని చేసి వైసీపీని ఎదురుకోవాల్సిన నేతలు ఒకరికి ఒకరు సాయం చేసుకోకుండా..విమర్శలు చేసుకుంటూ ఇంకా ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారు.  

దీనికి విశాఖ జిల్లాలోనే టీడీపీ నేతలే ఉదాహరణగా నిలుస్తున్నారు. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్, విశాఖ అర్బన్ అధ్యక్షుడు ఎస్‌ఏ రెహమాన్ కు అసలు పడటం లేదు. వీరి మధ్య అంతర్గత విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెహమాన్ చేసే ఏ కార్యక్రమానికి గణేశ్ సహకారం అందించడం లేదు.

పైగా పార్టీ ఆఫీసుకు కూడా గణేశ్ రావడం లేదు. దీంతో ఇటీవల విశాఖ పర్యటనకు వచ్చిన నారా లోకేశ్ కు రెహమాన్ ఫిర్యాదు చేశారు. తనకు గణేశ్ ఏ మాత్రం సహకరించడం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఈ క్రమంలోనే వాసుపల్లికి.. రెహమాన్ ఓ లేఖాస్త్రం సంధించారు. గతంలో అర్బన్ అధ్యక్షుడుగా పని చేసిన వాసుపల్లి కనీసం పార్టీ నియమ నిబంధనలని తెలుసుకుని ఉండాలని, తాను అర్బన్ అధ్యక్షుడుగా ప్రమాణం చేసేటప్పుడు కూడా వాసుపల్లి రాలేదని పేర్కొన్నాడు. అలాగే విశాఖ దక్షిణ ఎమ్మెల్యేగా పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు సహాయ సహకారాలు అందించాలని, లేకుంటే హైకమాండ్ దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లాల్సి వస్తుందని లేఖలో రెహమాన్ వాసుపల్లిని హెచ్చరించారు.

ఇక విశాఖ జిల్లా రాజకీయాల్లో ఈ లేఖ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రెహమాన్ రాసిన లేఖకు గణేశ్ ఎలాంటి సమాధానమిస్తారని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న గ‌ణేశ్‌ను త‌ప్పించి రెహమాన్‌కు ప‌గ్గాలు ఇవ్వ‌డం గ‌ణేశ్‌కు న‌చ్చ‌లేదు. అప్ప‌టి నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమంటోంది.

ఇక సీనియ‌ర్ నేత‌లు వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబు, గంటా శ్రీనివాస‌రావు, స‌బ్బం హ‌రి ఇలా ఎవ‌రికి వారు త‌మ‌కు న‌చ్చిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రూర‌ల్ జిల్లాలో పోటీ చేసి ఓడిపోయిన నేత‌లు కూడా పార్టీని ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు.

వీళ్ళే కాదు విశాఖలో కొందరు సీనియర్ నేతలు కూడా కలిసికట్టుగా పని చేయకుండా పార్టీకి నష్టం వచ్చేలా చేస్తున్నారని టాక్ ఉంది. ఎవరి కార్యక్రమం వారు చేసుకుంటూ విశాఖ నేతలు పార్టీ బలోపేతానికి గానీ, వైసీపీని ధీటుగా ఎదుర్కోవడానికి కృషి చేయట్లేదని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English