టికెట్ల రేట్ల గొడ‌వ‌పై బాల‌య్య ఏమ‌న్నాడంటే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టికెట్ల ధ‌ర‌ల గొడ‌వ కొన్ని నెల‌లుగా చ‌ర్చ‌నీయాంశం అవుతున్న సంగ‌తి తెలిసిందే. వ‌కీల్ సాబ్ సినిమాతో మొద‌లైన టికెట్ల రేట్ల నియంత్ర‌ణ.. త‌ర్వాత కూడా కొన‌సాగుతోంది. ప‌రిశ్ర‌మ పెద్ద‌లు ఎంత గ‌ట్టిగా ప్ర‌య‌త్నించినా ఈ విష‌యంలో ప్ర‌భుత్వ ఆలోచ‌న మార‌ట్లేదు. చివ‌రికిప్పుడు ఏపీలో థియేట‌ర్ల య‌జ‌మానులు కోర్టుకెక్క‌డంతో వారికి అనుకూలంగా తీర్పు వ‌చ్చింది.

ఏప్రిల్‌కు ముందున్న రేట్ల‌నే కొన‌సాగించాల‌ని, ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో నం.35ను వెన‌క్కి తీసుకోవాల‌ని కోర్టు ఆదేశించింది. దీనిపై ప్ర‌భుత్వం అప్పీల్‌కు వెళ్తున్న సంగ‌తి తెలిసిందే. ఐతే ఈ వ్య‌వ‌హారంపై ఇప్పుడు సినీ ప్ర‌ముఖులెవ‌రూ స్పందించ‌డానికి ఇష్ట‌ప‌డ‌ట్లేదు. ఏం జ‌రుగుతుందో చూద్దాం అన్న‌ట్లు మౌనంగా ఉంటున్నారు. ఇలాంటి త‌రుణంలో నంద‌మూరి బాల‌కృష్ణ ఈ విష‌య‌మై స్పందించారు.

త‌న కొత్త చిత్రం అఖండ విజ‌య‌యాత్ర‌లో భాగంగా ఏపీలో ప‌ర్య‌టిస్తున్న బాల‌య్య‌కు మంగ‌ళ‌గిరిలో విలేక‌రుల నుంచి టికెట్ల రేట్ల వ్యవ‌హారంపై ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. టికెట్ల రేట్ల‌పై నియంత్ర‌ణ‌ను ముందే ఎత్తి వేస్తే అఖండ‌కు మేలు జ‌రిగేది క‌దా.. కోర్టు ఉత్త‌ర్వుల‌పై ఏమంటారు.. ప్ర‌భుత్వం అప్పీల్‌కు వెళ్ల‌బోతుండ‌టంపై మీ స్పంద‌నేంటి లాంటి ప్ర‌శ్న‌లు బాల‌య్య‌కు సంధించారు విలేక‌రులు. దీనికాయ‌న బ‌దులిస్తూ.. ‘‘ఏపీలో ఉన్న సినిమా టికెట్‌ ధరల విషయంపై ‘అఖండ’ విడుదలకు ముందు మేమంతా చర్చించాం.

కానీ, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి ధైర్యంగా ముందుకొచ్చి చిత్రాన్ని విడుదల చేశారు. సినిమా బాగా వచ్చింది. టికెట్ల విషయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఇప్పుడే విడుదల చేద్దామన్నారు. టికెట్ల విషయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తామంటోంది.. ఏం జరుగుతుందో చూద్దాం’’ అన్నారు. మ‌రోవైపు మ‌ల్టీస్టార‌ర్లు చేస్తారా అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానంగా.. ఎవ‌రైనా మంచి క‌థ‌తో వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తాన‌ని బాల‌య్య బ‌దులిచ్చారు.