కొత్త ఫార్ములాతో ప‌వ‌న్‌...తెలంగాణ‌పై ప్ర‌త్యేక ఫోక‌స్‌

కొత్త ఫార్ములాతో ప‌వ‌న్‌...తెలంగాణ‌పై ప్ర‌త్యేక ఫోక‌స్‌

సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోరు ముగిసిన నేప‌థ్యంలో రాజ‌కీయ నేత‌లు రిలాక్స్ అవుతుంటే....అదే స‌మ‌యంలో తెలంగాణ‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు వ‌చ్చిప‌డ్డాయి. షెడ్యూల్ శ‌నివారం విడుద‌ల అయిన‌ప్ప‌టికీ, అంత‌కుముందు నుంచే ఆయా పార్టీల నేత‌లు ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో బిజీగా ఉండిపోయారు. ఇప్ప‌టికే అధికార టీఆర్ఎస్‌, ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్షమైన‌ కాంగ్రెస్ పార్టీ స‌హా బీజేపీ, టీడీపీలు త‌న స‌న్నాహాలు చేసుకోగా...ఈ జాబితాలో జ‌న‌సేన కూడా చేరింది. అయితే, పార్ల‌మెంటు ఎన్నిక‌ల విష‌యంలో అనుస‌రించిన వ్యూహంకంటే భిన్న‌మైన వ్యూహాన్ని జ‌న‌సేన అమ‌ల్లో పెడుతోంది.

ఇటీవ‌ల జ‌రిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో జ‌న‌సేన‌ ఏడు స్థానాల్లో పోటీ చేసింది. ప‌ది స్థానాల్లో బ‌రిలో దిగ‌లేదు. అయితే, రాష్ట్రంలోని 5857 ఎంపీటీసీ, 535 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌యింది. ఈ నేప‌థ్యంలో హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేద్దామ‌ని నిర్ణ‌యించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్‌కు కార్యకర్తలు ఈ మేర‌కు విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ స‌మావేశం ఏర్పాటు చేయించిందే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కావ‌డం కావ‌డం గ‌మ‌నార్హం.

జనసేన తెలంగాణ ఇంచార్జ్ ఎన్.శంకర్ గౌడ్, ఉపాధ్యక్షుడుడు బి.మహేందర్ రెడ్డి ఈ స‌మావేశం అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ "స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. లోక్‌సభ ఎన్నికల్లో మనం ఏడు స్థానాల్లో పోటీ చేశాం. స్థానిక ఎన్నికల్లో పోటీ ఇందుకు భిన్నంగా ఉంటుంది. మన పార్టీకి యువత, మహిళలు బలం" అన్నారు. అనంతరం కార్యకర్తలు మాట్లాడుతూ "జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానం, పార్టీ ఏడు సిద్ధాంతాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో అవసరం. వాటిని గ్రామ స్థాయి నుంచి అమలు చేసేందుకు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలి. ఇందుకు అనుగుణంగా పార్టీ అధ్యక్షులు తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ముందుకు వెళ్తాం" అన్నారు. కాగా, తాజా నిర్ణ‌యం ప్ర‌కారం, తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులను నిలపాలని పార్టీ బ‌రిలో దిగ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English