వివేకా హ‌త్య‌పై సీఎం జ‌గ‌న్‌ సంచ‌ల‌న కామెంట్లు!

అసెంబ్లీలో ఈ రోజు మ‌రో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఒక‌టి టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. త‌న‌ను వైసీపీ నాయ‌కులు అవ‌మానించారంటూ.. ముఖ్యంగా త‌న కుటుంబాన్ని, త‌న స‌తీమ‌ణిని కూడా అవ‌మానించారంటూ.. ఆయ‌న స‌భ‌ను బాయ్ కాట్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీఎం అయిన త‌ర్వాతే .. స‌భ‌లోకి అడుగు పెడ‌తాన‌ని అన్నారు. ఇది ఒక సంచ‌ల‌న‌మైతే.. మ‌రో సంచ‌ల‌నం కూడా చోటు చేసుకుంది.

అదే ఇప్ప‌టి వ‌ర‌కు వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌పై నోరు విప్ప‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. తాజాగా అసెంబ్లీ వేదిక‌గా నోరు విప్పారు. నిజానికి దీనిని ఎవ‌రూ ఊహించ‌లేదు.

తాజాగా జ‌రిగిన స‌భ‌లో వాస్త‌వానికి వ్య‌వ‌సాయ బిల్లుల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే.. అనూహ్యంగా చ‌ర్చ ప‌క్క‌దారి ప‌ట్టింది. ఈ క్ర‌మంలోనే.. చంద్ర‌బాబు నిష్క్ర‌మించ‌డం.. ఆవెంట‌నే.. అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకోవ‌డం తెలిసిందే.

ఈ క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. “మా బాబాయి హ‌త్య గురించి మాట్లాడుతారు అధ్య‌క్షా! వివేకానంద‌రెడ్డి మా బాబాయి.. చంద్ర‌బాబు చిన్నాన్న కాదు. మా నాన్న రాజ‌శేఖ‌ర‌రెడ్డికి సొంత త‌మ్ముడు., ఆయ‌న హ‌త్య‌కు గురైతే.. మాకు బాధ ఉండ‌దా? అధ్య‌క్షా. అది కూడా మేమే చేయించామంటాడు(చంద్ర‌బాబు). అది జ‌రిగింది ఎప్పుడు అధ్య‌క్షా.. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉండ‌గానే. అప్పుడు ఎందుకు విచార‌ణ చేప‌ట్ట‌లేదు”.. అని ప్ర‌శ్నించారు.,

అంతేకాదు.. “మా చిన్నాన్న హ‌త్య కేసులో మ‌రో పిల్లోడు.. అవినాశ్ ఉన్నాడ‌ని అంటాడు. ఆ పిల్లోడు ఎవ‌ర‌ధ్య‌క్షా..? మానాన్న‌కు క‌జిన్ బ్ర‌ద‌ర్ కొడుకు. అంటే.. నాకేమ‌వుతాడు అధ్య‌క్షా.. త‌మ్ముడు లాంటోడు. అత‌నిపైనా కామెంట్లు చేస్తాడు. మా చిన్నాన‌న్న‌ను మేం ఎందుకు హ‌త్య చేస్తాం అధ్య‌క్షా? ఆయ‌న‌ను ఎమ్మెల్సీని చేయాల‌ని అనుకున్నాం. అందుకే అక్క‌డ ఎమ్మెల్సీగా ఆయ‌న‌ను పెట్టాం. ఆయ‌న‌ను ఎలాగైనా ఓడించేందుకు అప్ప‌టి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ చంద్ర‌బాబు డ‌బ్బులు పంచారు. అధికారం వినియోగించారు. పోలీసుల‌ను వినియోగించారు. మొత్తానికి వివేకాగారిని ఓడించారు. ఎవ‌రు అధ్య‌క్షా ఇవ‌న్నీ చేసింది., ఇప్పుడు వ‌చ్చి నీతులు చెబుతున్నాడు” అని సీఎం జ‌గ‌న్ విరుచుకుప‌డ్డారు. అయితే.. తొలిసారి జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. వివేకా హ‌త్య గురించి మాట్లాడ‌డం సంచ‌ల‌నంగా మారింది.