సూర్య కోసం ఇండ‌స్ట్రీ ఒక్క‌టైంది

త‌మిళ స్టార్ హీరో సూర్య ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తూ త‌నే స్వ‌యంగా నిర్మించిన చిత్రం జై భీమ్. దీపావ‌ళి ముంగిట ఈ సినిమా అమేజాన్ ప్రైమ్‌లో నేరుగా రిలీజ‌వ‌డం.. అద్భుత స్పంద‌న తెచ్చుకోవ‌డం తెలిసిందే. సూర్య కెరీర్లోనే అత్యుత్త‌మ చిత్రాల్లో ఒక‌టిగా.. సమాజానికి చాలా అవ‌స‌ర‌మైన సినిమాగా దీనిపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిసింది.

ఇంత గొప్ప సినిమాకు సైతం వివాదాలు త‌ప్ప‌లేదు. సినిమాలో ఒక చోట చూపించిన ఓ పోస్ట‌ర్ వ‌న్నియార్ కుల‌స్థుల‌ను కించ‌ప‌రిచేలా ఉందంటూ ఆ వ‌ర్గానికి చెందిన వారు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. సూర్య క్ష‌మాప‌ణ చెప్పాల‌ని.. సినిమాను నిషేధించాల‌ని డిమాండ్ చేశారు. ఐతే సినిమాలో ఆ పోస్ట‌ర్ క‌నిపించ‌కుండా తీసేశారు. త‌మ‌కు ఎవ‌రినీ కించ‌ప‌రిచే ఉద్దేశం లేద‌ని.. ఇలాంటి వాటితో ప‌బ్లిసిటీ చేసుకునే అల‌వాటు త‌న‌కు లేద‌ని సూర్య వివ‌ర‌ణ కూడా ఇచ్చాడు.

అయినా స‌రే.. వ‌న్నియార్ కుల సంఘం అధ్య‌క్షుడు అన్బుమ‌ణి రాందాస్ వెన‌క్కి త‌గ్గ‌లేదు. సూర్య త‌మ‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే అని ప‌ట్టుబ‌ట్టారు. దీంతో సూర్య‌కు మ‌ద్ద‌తుగా త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులంతా రంగంలోకి దిగారు. వెట్రిమార‌న్, సిద్దార్థ్, లోకేష్ క‌న‌క‌రాజ్, అమీర్.. ఇలా ఒక్కొక్క‌రుగా సూర్య‌కు మ‌ద్ద‌తుగా ట్వీట్లు వేయ‌డం మొద‌లుపెట్టారు. westandwithsuriya అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి అత‌డికి మ‌ద్ద‌తుగా నిలిచారు.

ఎంతో గొప్ప సంక‌ల్పంతో జై భీమ్ సినిమా తీశార‌ని.. ఇలాంటి సినిమాను వివాదాల్లోకి లాగ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని వారు ప్ర‌శ్నించారు. సూర్య స‌ద‌రు పోస్ట‌ర్‌ను సినిమా నుంచి తొల‌గించాక కూడా క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేయ‌డం ప‌ట్ల అంద‌రూ అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ వివాదంపై దక్షిణాది చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్ కూడా స్పందించారు. సూర్య క్ష‌మాప‌ణ చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.