బాబు తిట్ల‌ను కేసీఆర్ లెక్క పెడుతుంటారా?

బాబు తిట్ల‌ను కేసీఆర్ లెక్క పెడుతుంటారా?

కొన్ని మాట‌లు చాలానే అర్థాల్ని చెప్పేస్తుంటాయి. అప్ర‌య‌త్నంగా చెప్పినా.. అవ‌త‌ల మ‌నిషి మ‌న‌సులో ఏముందో చెప్పే ప‌వ‌ర్ మాట‌కు ఉంటుంది. తాజాగా క‌రీంన‌గ‌ర్ స‌భ‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన ప్ర‌సంగం చూస్తే.. అందులో ఎప్ప‌టి మాదిరి ఏపీ సీఎం చంద్ర‌బాబును తిట్ట‌టం తెలిసిందే.

అయితే.. బాబు త‌న‌ను అదే ప‌నిగా తిడుతున్న విష‌యాన్ని కేసీఆర్ చెప్ప‌టం..ఆ క్ర‌మంలో ఆయ‌న మాట‌ల్లో వినిపించిన లెక్క చూస్తే.. కాసింత ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. బాబును లెక్క చేయ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే కేసీఆర్ తీరు చాలామందికి ఇష్టం. బాబును వ్య‌తిరేకించే వాళ్లు కేసీఆర్ మీద ఇష్టంతో క‌న్నా... బాబు మీద కోపంతో ఆయ‌న్ను.. ఆయ‌న మాట‌ల్ని అమితంగా ఇష్ట‌ప‌డుతుంటారు.

అలాంటి ఆయ‌న‌.. చిన్న పిల్లాడి మాదిరి చూశారా.. న‌న్ను చంద్ర‌బాబు మూడు నెల‌ల్లో మూడు వేల సార్లు తిట్టారంటూ లెక్క చెప్పిన వైనం చూస్తే.. రాజ‌కీయాల‌న్నాక తిట్లు.. తీర‌మంగ‌ళాలు కాక‌.. పొగ‌డ్త‌లు ఉంటాయా? అన్న అనుమానం రాక మాన‌దు. బాబు దాకా ఎందుకు కేసీఆర్ మాత్రం నోరు విప్పితే ఎవ‌రో ఒక‌రిని తిట్ట‌ట‌మే ప‌ని క‌దా?  ఎక్క‌డి దాకానో ఎందుకు నిన్న‌టి క‌రీంన‌గ‌ర్ స‌భ‌నేచూస్తే.. ఏపీ ముఖ్య‌మంత్రిచంద్ర‌బాబుతో పాటు.. జాతీయ పార్టీలకు కీల‌క‌నేత‌లైన మోడీని.. రాహుల్ గాంధీని తిట్టి పోసిన తీరు కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించ‌క మాన‌దు.

త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను ఉద్దేశించి అదే ప‌నిగా తిట్టే కేసీఆర్‌.. త‌న‌ను ఎవ‌రూ తిట్ట‌కూడ‌దు.. విమ‌ర్శించ‌కూడ‌ద‌న్న‌ట్లుగా మాట్లాడ‌టం కొత్తేం కాదు. కాకుంటే.. త‌న‌ను తిట్టే వారిపైన ఎట‌కార‌పు పంచ్ లు వేసే కేసీఆర్ కు భిన్నంగా చిన్న‌పిల్లాడి మాదిరి.. మూడు నెల‌ల్లో బాబు మూడు వేల సార్లు తిడుతున్నారంటూ చేసిన వ్యాఖ్య కేసీఆర్ స్థాయికి త‌గ్గ‌ట్లు లేద‌న్న మాట చెప్ప‌క త‌ప్ప‌దు. కేసీఆర్ అంటే ఏంది?  నిప్పు క‌ణిక‌ల్లాంటి మాట‌లతో ప్ర‌త్య‌ర్థుల‌కు  ఊపిరి ఆడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించాల్సింది పోయి.. త‌న‌ను తిట్టే తిట్ల లెక్క‌ను ప్ర‌జ‌ల ముందు చెప్పుకోవ‌టం చూసిన‌ప్పుడు కేసీఆర్ మాట‌ల్లో చురుకుద‌నం మిస్ అవుతుందా? అన్న సందేహం క‌లుగ‌క మాన‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English