ఓవ‌రాక్ష‌న్ తో విజ‌య‌సాయి అడ్డంగా బుక్‌!

ఓవ‌రాక్ష‌న్ తో విజ‌య‌సాయి అడ్డంగా బుక్‌!

ఏదైనా మితంగా ఉండాలి. ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తే మొద‌టికే మోసం వ‌స్తుంది. మైలేజీ మత్తులో ప‌డేసి.. ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. చుట్టూ ఉన్న వారు చూస్తూ ఉండిపోర‌న్న విష‌యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయికి బాగానే అర్థ‌మై ఉంటుంది.
ఏపీ విభ‌జ‌న సంద‌ర్భంగా ఇచ్చిన హామీల అమ‌లు విష‌యంపై కేంద్రంపై చేస్తున్న పోరాటంలో త‌మ పార్టీ వెనుక‌బ‌డిపోయింద‌న్న అతృత విజ‌య‌సాయి చేత ఓవ‌రాక్ష‌న్ చేసేలా చేసింది. వెల్ లోకి దూసుకుపోవ‌టం ఒక ఎత్తు అయితే.. అసెంబ్లీలో త‌మ పార్టీ నేత‌ల మాదిరి.. విజ‌య‌సాయి ఉప‌రాష్ట్రప‌తిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్య‌ల‌కు.. ఆరోప‌ణ‌ల‌కు రాజ్య‌స‌భ‌లోని ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

తన మాట‌లు రివ‌ర్స్ అయ్యాయ‌న్న విష‌యాన్ని గుర్తించిన విజ‌య‌సాయి.. ఉప రాష్ట్రప‌తి వెంక‌య్యకు సారీ చెప్పేంత‌లో.. క్ష‌మాప‌ణ‌ల మీద త‌న‌కు ఎలాంటి ఆస‌క్తి లేద‌ని ఆయ‌న తేల్చేయ‌టం విజ‌య‌సాయికి ఇబ్బందికరంగా మారింది. ఇదే స‌మ‌యంలో స‌భ‌లో విజ‌య‌సాయి వ్య‌వ‌హ‌రించిన తీరు ఏ మాత్రం బాగోలేదంటూ రాజ్య‌స‌భ‌లోని ప‌లువురు స‌భ్యులు అభ్యంత‌రం చేయ‌టంతో విజ‌య‌సాయికి దిక్కుతోచ‌ని ప‌రిస్థితుల్లో ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇదే స‌మ‌యంలో గ‌ళం విప్పిన టీడీపీ ఎంపీ సీఎం ర‌మేశ్‌.. విజ‌య‌సాయి తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. దీనిపై త‌న‌కు వివ‌ర‌ణ ఇచ్చే టైం ఇవ్వాల‌ని కోరిన విజ‌య‌సాయికి.. అక్క‌ర్లేద‌న్న మాట వెంక‌య్య నుంచి వ‌చ్చింది.

వివ‌ర‌ణ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని.. వివ‌ర‌ణ పేరుతో స‌మ‌ర్థించుకుంటే అర్థం లేద‌ని.. మ‌రో చ‌ర్చ‌కు అవ‌కాశం లేద‌ని తేల్చారు.
అనంత‌రం.. విజ‌య‌సాయి మాట్లాడుతూ.. భావోద్వేగ అంశంపై మాట్లాడే వేళ‌లో తాను అలా వ్య‌వ‌హ‌రించాల్సి వ‌చ్చింద‌ని.. విభ‌జ‌న‌కు సంబంధించిన అంశంలో ఏపీకి జ‌రిగిన దానిపై ఆ రాష్ట్రానికి చెందిన వ్య‌క్తిగా త‌న‌కు స‌రైన అవ‌కాశం క‌ల్పించ‌లేద‌న్న ఉద్దేశంతో తాను అలా మాట్లాడానే త‌ప్పించి.. మ‌రేమీ లేద‌న్నారు.  ఈ సంద‌ర్భంగా వెంక‌య్య‌కు స‌భాముఖంగా సారీ చెప్పారు. రాజ‌కీయ మైలేజీ హ‌డావుడిలో ప‌డి..తాను ఉన్న‌ది రాజ్య‌స‌భ‌లో అన్న విష‌యాన్ని విజ‌య‌సాయి మ‌ర్చిపోయి.. త‌న తీరుతో మొట్టికాయ‌లు తినాల్సి వ‌చ్చింద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు