డ‌బ్బు గుట్ట‌లు..మాజీ ప్ర‌ధాని ఇంట్లో 1874 కోట్లు

డ‌బ్బు గుట్ట‌లు..మాజీ ప్ర‌ధాని ఇంట్లో 1874 కోట్లు

అవినీతికి ఏ దేశం అతీతం కాద‌ని...ప్యూన్ నుంచి ప్ర‌ధాని ప‌ద‌వి వ‌ర‌కు ప‌ద‌విని తాక‌ట్టుపెడితే...పైస‌ల‌కు కొద‌వేమీ ఉండ‌ద‌ని నిరూపించే ఘ‌ట‌న ఇది. ప్రభుత్వ రంగ 1-మలేషియా డెవలప్‌మెంట్ బెర్హద్ (1ఎండీబీ) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ నివాసంలో కళ్లు చెదిరే విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నజీబ్‌కు చెందిన అపార్ట్‌మెంట్లలో సోదాలు జరిపి భారీ మొత్తంలో విదేశీ కరెన్సీతోపాటు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కౌలాలంపూర్‌లోని పెవిలియన్ రెసిడెన్స్‌లలో ఏకకాలంలో సోదాలు జరిపిన పోలీసులు 27.30 కోట్ల డాలర్ల (రూ.1,874కోట్లు) విలువైన నగలు, వస్తువులను, నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. 35 బ్యాగుల్లో సర్దిపెట్టి ఉంచిన వీటిని స్వాధీనం చేసుకుని లెక్కించామని, మరో 37 సంచుల్లో ఉన్న గడియారాలు, ఆభరణాలను లెక్కించాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.

మలేషియా చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద ఆస్తుల స్వాధీనం ఘటన అని మలేషియా వాణిజ్యపరమైన నేరాల విచారణ విభాగం అధిపతి అమర్‌సింగ్ చెప్పారు. విదేశాల నుంచి ఎంతో విలువైన నగలు, హ్యాండ్‌బ్యాగులు తెప్పించుకున్నట్లు సోదాల్లో వెల్లడైంది. నజీబ్‌కు చెందిన ఆరు నివాసాల్లో సోదాలు జ‌రుపగా, 1,400 నెక్లెస్‌లు, 2,200 రింగులు, 567 హ్యాండ్‌బ్యాగులు, 423 గడియారాలు, 234 జతల కళ్లద్దాలు బయటపడ్డాయి.

నజీబ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన సన్నిహితులు.. చమురు ఒప్పందాల పేరిట కోట్లాది రూపాయలు దండుకొని అమెరికా తరలించి రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిపారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే నజీబ్ దంపతులను నేర విచారణ సంస్థ అధికారులు రెండుసార్లు ప్రశ్నించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు