త్వ‌ర‌లో విడుద‌లః అమిత్‌షా స‌మ‌ర్పించు జ‌గ‌న్‌-ప‌వ‌న్ సినిమా

త్వ‌ర‌లో విడుద‌లః అమిత్‌షా స‌మ‌ర్పించు జ‌గ‌న్‌-ప‌వ‌న్ సినిమా

తెలుగుదేశం పార్టీ నేత‌లు త‌మ దూకుడును పెంచారు. జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌పై టీడీపీ నేతలు ఇప్ప‌టికే విరుచుకుప‌డుతున్న సంగతి తెలిసిందే. ఇటు విలేక‌రుల స‌మావేశాల్లో, అటు టీవీ చ‌ర్చ‌ల్లో ప‌చ్చ పార్టీ నేత‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇందుకు కార‌ణం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్విట్ట‌ర్ ద్వారా విమ‌ర్శ‌లు చేయ‌డం. అయితే తాము సంప్ర‌దాయ మీడియాలో విమ‌ర్శ‌లు చేస్తే స‌రిపోద‌ని టీడీపీ నేత‌లు భావించిన‌ట్లుంది అందుకే ‘సోషల్‌ వార్‌’ స్టార్ట్‌ చేశారు. పవన్‌ తరహాలోనే ట్వీట్లతో విమర్శలు ప్రారంభించారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఈ కొత్త ర‌చ్చ‌ను ప్రారంభించారు.

త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తూ...గ‌త కొద్దికాలంగా పంటికింద రాయిలాగా మారిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను జ‌త చేస్తూ టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్లో ఎదురుదాడి మొద‌లు పెట్టారు.  ‘జగన్-పవన్ సినిమా త్వరలో విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం ప్రశాంత్ కిషోర్. మోడీ-అమిత్ షా నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం మీ ముందుకు రాబోతోంది’ అని ట్విటర్‌ ద్వారా విమ‌ర్శ‌లు చేశారు. పవన్‌, వైసీపీ అధినేత జగన్‌లను విమర్శిస్తూ చేసిన ఈ ట్వీట్‌ను టీడీపీ శ్రేణులు స‌హ‌జంగానే వైర‌ల్ చేశాయి. జయదేవ్ ట్వీట్ వైరల్ అయిన నేప‌థ్యంలో వైసీపీ, జ‌న‌సేన పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి మ‌రి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు