సుబ్బారెడ్డిపై దాడి చేసింది అఖిల‌ప్రియ మ‌నుషులేనా?

సుబ్బారెడ్డిపై దాడి చేసింది అఖిల‌ప్రియ మ‌నుషులేనా?

క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాలు మ‌రోమారు వేడెక్కాయి. పర్యాటక శాఖా మంత్రి అఖిల ప్రియ, టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య గత కొంతకాలంగా ఉన్న‌ విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శల బాణాలు సంధిస్తున్నారు. భూమా నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా అఖిలప్రియ చేసిన వ్యాఖ్యల నుంచి వీరి మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి.

ముఖ్యమంత్రి చంద్ర‌బాబు పిలిచి మాట్లాడిన తర్వాత ఇది కొద్దిగా స‌ద్దుమ‌ణిగింది. ఇదిలా ఉంటే తాజాగా ఏవీ సుబ్బారెడ్డి మీద రాళ్ళ దాడి జరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల మిట్ట దగ్గర టీడీపీ నేతల సైకిల్‌ యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై ప్రత్యర్థులు రాళ్ల దాడికి దిగారు. భూమా వర్గీయులే దాడి చేశారని సుబ్బారెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు సంచలనంగా మారాయి.

అఖిలప్రియ వర్గీయులే దాడి చేశారని సుబ్బారెడ్డి ఆరోపిస్తూ ఈ ఘటనపై సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంత కాలంగా మంత్రి అఖిలప్రియకు ఏవి సుబ్బారెడ్డికి మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. అఖిల ప్రియ దూకుడు సుబ్బారెడ్డికి ఇబ్బందిగా మారడం..తనకు ప్రాధాన్యత కల్పించకపోవడంతో ఆయన ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. మ‌రోవైపు దీనిపై ఇంకా అఖిల ప్రియ ఇప్పటి వరకు స్పందించలేదు. దాడి చేసింది ఎవరు అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

‘‘35 ఏళ్లు భూమా నాగిరెడ్డికి ప్రాణంలో ప్రాణంగా ఉన్నాను. భూమా కుటుంబానికి నా ప్రాణాలొడ్డాను. ఫ్యాక్షన్ గొడవల్లో నా వర్గీయులు కూడా చనిపోయారు. వాళ్ల కుటుంబం కోసం ఇంత చేస్తే నాపైనే దాడి చేశారు. దాడితో విస్మయానికి గురయ్యాను. విభేదాలు అన్నదమ్ముల మధ్యనే వస్తాయి ఇది సహజం. విభేదాలకు పరియవసానం ఇదా? మేము ఇద్దరం ఓకే పార్టీలో ఉన్నాము కాబట్టి... పార్టీ శ్రేయస్సు దృష్ట్యా మౌనంగా ఉంటున్నా. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే... నేనేంటో మాటల్లో కాదు... చేతల్లో చూపిస్తాను’’ అని టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

అయితే, ఇద్ద‌రికీ చంద్ర‌బాబు నుంచి సాఫ్ట్ వార్నింగులు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కొస్తున్న నేప‌థ్యంలో ఎవ‌రు వేషాలు వేసినా స‌హించేది లేద‌ని హెచ్చిరించిన‌ట్టు స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English