ఎవడి తెలుగుతల్లి అని ప్రశ్నించావుగా కేసీఆర్

ఎవడి తెలుగుతల్లి అని ప్రశ్నించావుగా కేసీఆర్

తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావును కాంగ్రెస్ పార్టీ ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మ‌రోమారు టార్గెట్ చేసుకున్నారు. ఓవైపు ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అట్ట‌హాసంగా సిద్ధ‌మ‌వుతుంటే...మ‌రోవైపు కేసీఆర్‌కు బీపీ పెంచేలా చేశాడు. ఏకంగా బ‌హిరంగా లేఖ రాసి కేసీఆర్‌ను ప్ర‌శ్నించారు. `ఎవ‌రీ తెలుగుత‌ల్లి.. ఎవ‌డికి త‌ల్లి..? అని తెలంగాణా ఉద్య‌మ స‌మ‌యంలో త‌ల్లి భాష‌ను గురించి అవ‌హేళ‌న‌గా మాట్లాడిన మీరు ఇప్పుడు ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు నిర్వ‌హించ‌డానికి ఎందుకు హ‌డావుడి చేస్తున్నారో తెలంగాణా స‌మాజం అంత‌టికీ తెలుసు` అంటూ ఎద్దేవా చేశారు.

ఇంటి ఆడబిడ్డను ఏడ్పించుకుంటూ ఇంట్లో పండుగ చేసుకుంటున్న తరహాలో మీరు తెలంగాణా రాష్ట్రంలో తెలుగు భాష‌ను అభివృద్ధి చేయ‌డానికి ప‌రిష్క‌రించాల్సిన స‌మ‌స్య‌ల‌ను విస్మ‌రించారు అంటూ నిప్పులు చెరిగారు. `నోరు న‌వ్వుతుంటే నొస‌లు వెక్కిరిస్తున్న‌ట్లు ఒక‌వైపు భావి పౌరుల‌కు ప్రాథ‌మిక స్థాయి నుంచి తెలుగును నేర్పించే వేలాది తెలుగు పాఠ‌శాల‌ల‌ను మూసివేసి, మ‌రోవైపు తెలుగు మ‌హాస‌భ‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించ‌డం భాషాభివృద్ధిపై మీరు చూపుతున్న కుటిల ప్రేమ‌కు అద్దం ప‌డుతుంది..అమ్మ‌భాష‌ను నేర్పించ‌డానికి మూల‌మైన భాషా పండితుల స‌మ‌స్య‌లు కూడా ప‌రిష్క‌రించ‌కుండా కేవ‌లం రెండు,మూడు రోజుల హ‌డావుడి చేస్తే మీరు కోరుకున్న ప్ర‌చారం వ‌స్తుందేమోగానీ, రాష్ట్రంలో భాషాభివృద్ధికి ఎలాంటి మేలు జ‌ర‌గ‌ద‌నే విష‌యం మీకు తెలియ‌ద‌ని అనుకోలేము` అని రేవంత్ రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో తెలుగు భాష‌కు త‌గిన గౌర‌వాన్ని క‌ల్పించాలంటే ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో మ‌న పొరుగున ఉన్న రాష్ట్రాల‌ను చూసైనా నేర్చుకోండని రేవంత్ వ్యాఖ్యానించారు. `క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌లో ఎంత పెద్ద సంస్థ‌ల‌కు చెందిన బోర్డుల‌నైనా స్థానిక భాష‌లో రాయాల్సిందే. ఒక‌వేళ ఇంగ్లీషులో రాయాల‌నుకున్నా పైన స్థానిక భాష‌ను భాష‌లో రాయాల్సి ఉంటుంది. ఒక‌వేళ ఎవ‌రైనా ఈ నిబంధ‌న‌ను అతిక్ర‌మిస్తే ఆ సంస్థ‌కు తాళాలు వేయ‌డానికి కూడా ఆ రాష్ట్ర ప్ర‌భుత్వాలు వెనుకంజ వేయ‌వు. క‌ర్నాట‌క‌లోని సినిమా హాళ్ల‌లో రెండు ర‌కాలైన టిక్కెట్ల ధ‌ర‌లు ఉంటాయి.స్థానిక భాష‌లో ఉండే చిత్రానికి టిక్కెట్టు త‌క్కువ‌గా ఉంటే అదే థియేట‌ర్‌లో ప్ర‌ద‌ర్శించే ప‌రాయి భాషా చిత్రానికి టిక్క‌ట్టు ధ‌ర ఎక్క‌వ‌గా ఉంటుంది.పైగా ఆ రాష్ట్రంలో రాష్ట్రావ‌త‌ర‌ణ ఉత్స‌వాల‌ను ఒక‌రోజు, రెండు రోజులు కాకుండా మాసోత్స‌వంగా నిర్వ‌హిస్తారు. అవ‌త‌ర‌ణ ఉత్స‌వాలు జ‌రిగే నెల రోజుల కాలంలో ప‌రాయి భాషా చిత్రాల ప్ర‌ద‌ర్శ‌న‌ను నిలిపివేసి కేవ‌లం క‌న్న‌డ చిత్రాల‌ను మాత్ర‌మే ప్ర‌ద‌ర్శిస్తారు. ఈ కార్య‌క్ర‌మాల‌న్నీ ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌చారం కోసం కాకుండా క‌న్న‌త‌ల్లి వంటి త‌మ మాతృభాష‌ను కాపాడుకోవాల‌నే స‌దుద్దేశ్యంతో అమ‌లు చేస్తున్నందుకే అక్క‌డ స‌త్ఫ‌లితాలు వ‌స్తున్నాయి. నిజంగా మీలో కూడా తెలుగు భాష ప‌ట్ల చిత్త‌శుద్ధి ఉంటే భాష‌ను కాపాడుకోవ‌డానికి అభివృద్ధి చేయ‌డానికి ఉన్న అవ‌రోధాల‌ను తొల‌గించండి.` అని రేవంత్ కోరారు.

ఈ సంద‌ర్భంగా రేవంత్ ప‌లు డిమాండ్లు పెట్టారు

- రేష‌న‌లైజేష‌న్ పేరుతో మూసివేసిన 4637 తెలుగు మీడియం ప్రాధ‌మిక‌, ప్రాధ‌మికోన్న‌త పాఠ‌శాల‌ల‌ను మ‌ళ్లీ ప్రారంభించాలి.

-రాష్ట్రంలో ఖాళీగా ఉన్న భాషా పండితుల టీచ‌ర్ పోస్టుల‌ను త‌క్ష‌ణం భ‌ర్తీ చేయాలి.

-ఉర్దూ ప్ర‌థ‌మ భాష‌గా ఉండే పాఠ‌శాల‌ల్లో ద్వితీయ భాష‌గా తెలుగు అధ్య‌య‌నం త‌ప్ప‌నిస‌రి చేయాలి.

-భాషా పండితుల పోస్టుల‌ను అప్ గ్రేడ్ చేయ‌డానికి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌ను చేప‌ట్టాలి.

-రాష్ట్రంలోని అధికార కార్యాల‌యాల్లో తెలుగును త‌ప్ప‌నిస‌రి విధానంగా అమ‌లు చేయాలి.

--బ‌మ్మెర గ్రామంలో పోత‌నామాత్యుని స‌మాధి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే కార్య‌క్ర‌మాన్ని త‌క్ష‌ణం ప్రారంభించాలి.

-తెలంగాణా రాష్ట్రంలోని ప్ర‌తి సంస్థ బోర్డులో తెలుగు భాష‌ను త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ని నిబంధ‌న‌లు విధిస్తూ ఉత్త‌ర్వులు ఇవ్వండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు