త్వరలో ఏపీ రాజధానికి కేసీఆర్

త్వరలో ఏపీ రాజధానికి కేసీఆర్

ఏపీ రాజధాని అమరావతి నగర శంకుస్థాపన సందర్భంగా వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి రాజధాని ప్రాంతానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.  ఏపీ సీఎం చంద్రబాబు ఆకస్మిక పిలుపు మేరకు కేసీఆర్ మరోసారి సాటి తెలుగురాష్ర్ట రాజధానికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే... ముందుగా అనుకున్న ప్రోగ్రాం కాకపోవడం.. గడువు తక్కువగా ఉండడంతో కేసీఆర్ షెడ్యూల్ అందుకు సహకరిస్తుందా అన్నదే అనుమానం. కేసీఆర్ రాక సంగతి ఎలా ఉన్నా చంద్రబాబు మాత్రం ఆయన్ను ఇప్పటికే మౌఖికంగా ఆహ్వానించారు.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నరు నరసింహన్ ఇచ్చిన విందులో ఇద్దరు ముఖ్యమంత్రులు చాలాసేపు ముచ్చటించుకున్న సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా చంద్రబాబు.. కేసీఆర్ ను ఏపీకి రమ్మని ఆహ్వానించారు. జనవరి 3వ తేదీన విజయవాడకు సమీపంలో ఎన్‌డిఆర్‌ఐ బెటాలియన్‌ శంకుస్థాపన జరుగుతోందని, ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథులుగా వస్తున్నారని, మీరు కూడా ఈ కార్యక్రమానికి వస్తే బాగుంటుందని కేసీఆర్‌ను చంద్రబాబు ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను తర్వాత తాను పంపిస్తానని, ఖచ్చితంగా హాజరు కావాలని కోరినట్టు తెలుస్తోంది. దీనికి కేసీఆర్ కూడా సానుకూలంగానే స్పందించారట.

చంద్రబాబు ఆహ్వానానికి ఓకే చెప్పిన కేసీఆర్... ఆ రోజు ముందుగా అనుకున్న కార్యక్రమాలు ఏవీ లేకపోతే తప్పకుండా వస్తానని అన్నట్లు తెలుస్తోంది. అయితే.. ప్రాధాన్యమున్న కార్యక్రమం కాకపోవడంతో కేసీఆర్ వస్తారా రారా అన్నది తెలియాల్సి ఉంది. కానీ... అదేసమయంలో ఇటీవల కాలంలో కేంద్రంతో కేసీఆర్ కు పెరిగిన సంబంధాల నేపథ్యంలో హోం మంత్రి రాజనాథ్ సింగ్ వస్తున్న కార్యక్రమం కావడంతో కేసీఆర్ కూడా వచ్చినా ఆశ్చర్యం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు