మోడీ ఇలాకాలో బ్యాంకులపై దాడులు

మోడీ ఇలాకాలో బ్యాంకులపై దాడులు

పెద్ద నోట్ల ర‌ద్దు- కొత్త క‌రెన్సీ అందుబాటులో లేక‌పోవ‌డంతో ప్ర‌జ‌ల్లో అస‌హ‌నం క‌ట్ట‌లు తెగుతోంది. ప‌్ర‌ధాని న‌రేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజ‌రాత్‌లో బ్యాంకుల‌పై దాడులు జ‌రిగాయి. డ‌బ్బు లేక వ‌రుస‌గా మూడు రోజుల నుంచి ప‌లు బ్యాంకులు మూత‌పడే ఉండ‌టంతో చిర్రెత్తుకొచ్చిన ప్ర‌జ‌లు వాటిపై దాడి చేశారు. గుజ‌రాత్‌ రాష్ట్రంలోని అమ్రేలి, సురేంద‌ర్ న‌గ‌ర్ జిల్లాల్లో ఉన్న ప‌లు బ్యాంకు బ్రాంచ్‌ల‌పై ఈ దాడులు జరిగాయి. వంద‌ల మంది క్యూలో వేచి ఉన్న స‌మ‌యంలో.. బ్యాంకులో డ‌బ్బు లేద‌ని చెప్ప‌డంతో అమ్రేలీ జిల్లాలోని ఎస్‌బీఐ, దేనా బ్యాంకు బ్రాంచ్‌లకు తాళాలు వేసి నిర‌స‌న తెలిపారు. క‌స్ట‌మ‌ర్ల‌లో చాలావ‌ర‌కు రైతులే ఉన్నార‌ని ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు.


ఇదిలాఉండ‌గా సురేంద‌ర్‌న‌గ‌ర్ జిల్లాలో కొన్ని బ్యాంకు బ్రాంచీల‌పై దాడి చేసిన ప్ర‌జ‌లు.. వాటి త‌లుపులు, కిటికీల‌ను ధ్వంసం చేశారు. శ‌నివారం నుంచి బ్యాంకులు మూసే ఉండ‌టంపై వాళ్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే సోమ‌వారం కూడా డ‌బ్బు రాక‌పోవ‌డంతో బ్యాంకు తెరిచి ఏం ప్ర‌యోజ‌న‌మ‌న్న ఉద్దేశంతో తాము మూసి ఉంచిన‌ట్లు బ్యాంకు సిబ్బంది తెలిపారు. ఇక కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా న‌గ‌ర్ హ‌వేలీ రాజ‌ధాని సిల్వాసాలో ఓ నేష‌న‌లైజ్ బ్యాంక్ సిబ్బందిపై క‌స్ట‌మ‌ర్లు దాడి చేశారు. ఈ స‌మ‌యంలో పోలీసులు రంగంలోకి దిగి సిబ్బందిని కాపాడారు. గుజ‌రాత్ లో జ‌రిగిన ఈ ప‌రిణామంపై విప‌క్షాలు ప్ర‌ధాన‌మంత్రి తీరును ఎద్దేవా చేశాయి.