కేసీఆర్.. 'తుగ్లక్', గుత్తా.. 'చెత్త'

కేసీఆర్.. 'తుగ్లక్', గుత్తా.. 'చెత్త'

విమర్శనాస్త్రాలు సంధించడంలో టీఆర్ఎస్ వర్గాలతో పోటీపడుతున్నారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. విమర్శించడంలో మాకూ టాలెంట్ ఉందన్న హింట్స్ ఇస్తూ  ప్రభుత్వాన్నే కాక సీఎం కేసీఆర్‌ పైనా ఆయన ఓ రేంజ్‌ లో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రికి వాస్తు భయం పట్టుకుందని, రూ.1000 కోట్లతో ఉన్న సచివాలయాన్ని పడగొట్టి కొత్తది కడతామనడంలో అర్ధం లేదని అన్నారు.

ఓ అడుగు ముందుకేసి, కొత్త సెక్రటేరియట్ నిర్మిస్తామని కేసీఆర్ చెప్పడాన్ని పిచ్చి తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. వాస్తుపై ఉన్న నమ్మకంతోనే ముఖ్యమంత్రి ఇదంతా చేస్తున్నారని రూ. కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఆయనకు లేదని కోమటిరెడ్డి మండిపడ్డారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచి పెట్టేందుకే కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మాణం తెరపైకి తెచ్చారని ఆరోపించారు.

వాస్తు భయంతోనే ముఖ్యమంత్రి ఇంత డబ్బు ఖర్చు చేసి కొత్త సచివాలయం నిర్మించాలని చూస్తున్నారని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. తనను విమర్శిస్తున్న గుత్తా సుఖేందర్ రెడ్డిని కూడా ఆయన దులిపేశారు. గుత్తా కాంగ్రెస్‌ ను వీడి టీఆర్ఎస్ లో చేరడాన్ని తప్పుపట్టిన కోమటిరెడ్డి, "ఆయన గుత్తా కాదు 'చెత్త' సుఖేందర్ రెడ్డిగా మారారు" అని విమర్శించారు. గత ఎన్నికల్లో తన వల్లే సుఖేందర్ రెడ్డి గెలిచారని అన్నారు. తమ మద్దతుతో గెలిచి తమనే విమర్శించడంపై తీవ్రంగా మండిపడ్డారు.

కోమటిరెడ్డి విమర్శల్లో ఇంతటి ఇంటెన్సిటీ ధ్వనించడం ఆసక్తిగా మారింది. ఇప్పటికే గుత్తాతో విబేధాలు తారస్థాయికి చేరాయి. తాజా వ్యాఖ్యలతో ఇరువర్గాల మధ్య విమర్శనాస్త్రాల జోరు పెరుగుతుందని అంతా అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే, సీఎంను 'గారు' అంటూ మర్యాదగా సంబోధించాలని గతంలోనే టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. మరి, ముఖ్యమంత్రిపై కోమటిరెడ్డి ఈ రేంజ్‌లో విరుచుకుపడడంతో అధికార పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English