కేసీఆర్ విగ్రహాన్ని పెడుతున్న మంథని ఎమ్మెల్యే

కేసీఆర్ విగ్రహాన్ని పెడుతున్న మంథని ఎమ్మెల్యే

జలవనరుల ప్రాజెక్టులకు ప్రముఖ నేతలు, సాగునీటి రంగ దిగ్గజాల పేర్లు పెట్టడం... ఆయా ప్రాజెక్టుల వద్ద వారి విగ్రహాలు పెట్టడం మామూలే. అయితే... ఎక్కువగా దివంగత నేతల విగ్రహాలే అలా పెడుతుంటారు. ఎంత గొప్ప నేతయినా.. ఆ ప్రాజెక్టు కోసం ఆయన ఎంత చేసినా కూడా వారు జీవించిన కాలం విగ్రహాలు పెట్టే అలవాటు ఎక్కడా కనిపించదు. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ విగ్రహాన్ని మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై ఆ పార్టీలోనూ ఇది చర్చనీయంశంగా మారినట్లు తెలుస్తోంది.

ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజల కోసం నిర్మాణం కానున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు కరీంనగర్ జిల్లా మేడిగడ్డలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు తాజాగా భూమి పూజ చేశారు. ప్రాణిహిత-చేవెళ్ల నమూనా మార్చి ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు.  ఈ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ దశ మారిపోతుందని టీఆరెస్ నేతలు అంటున్నారు. ఆ అభిమానంతోనే  కరీంనగర్ జిల్లా మంథని ఎమ్మెల్యే పుట్ట మధు ఏకంగా కేసీఆర్ విగ్రహం ఏర్పాటుకు రెడీ అవుతున్నారు.

గోదావరి, ప్రాణిహిత జలాల సద్వినియోగానికి ప్రభుత్వం నిర్మించనున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు మూడూ కూడా మంథని నియోజకవర్గంలోనే ఉన్నాయి. దీంతో మంథని ఎమ్మెల్యే మధు, నియోజకవర్గ ప్రజలు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అందుకే కేసీఆర్ కు కృతఙ్ఞతగా ఆయన విగ్రహాన్ని నిర్మించి మేడిగడ్డ వద్ద నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు కేసీఆర్ శంకుస్థాపన చేసిన అనంతరం ఈ విగ్రహాన్ని మేడిగడ్డలో ఏర్పాటు చేసే ఆలోచనలో మధు ఉన్నట్లు తెలుస్తోంది. ఏడడుగుల విగ్రహాన్ని నెలకొల్పుతారని తెలుస్తోంది. అయితే.. దీనికి ఇంకా పార్టీ ముఖ్యుల నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని.. మధు తన ఆలోచనను ఇప్పటికే చెప్పినప్పటికీ ఆమోద ముద్ర పడలేదని తెలుస్తోంది. సెంటిమెంట్లు పాటించే కేసీఆర్ ఈ విగ్రహ ఏర్పాటుపై పండితుల అభిప్రాయాన్ని తెలుసుకుని అంగీకారం తెలపాలా కాదనాలా అన్నది నిర్ణయించుకుంటారని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు