తెలంగాణ టీడీపీ పేరు మారుతోంది

తెలంగాణ టీడీపీ పేరు మారుతోంది

తెలంగాణ తెలుగుదేశం పార్టీ....తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల రీత్యా ఈ శాఖకు ఎదురవుతున్న తీవ్ర ఇక్కట్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుసబెట్టి ఎమ్మెల్యేలు పార్టీని వీడటం, అధినేత చంద్రబాబుతో సమావేశం తర్వాత కూడా నాయకులు బై చెప్పడం, ద్వితీయ శ్రేణి నేతలు సైతం కారెక్కడం ఇటీవల జరిగిన వరుస పరిణామాలు. ఈ నేపథ్యంలో పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కొత్త ఆలోచనతో టీడీపీ ముందుకు వస్తోంది.

పార్టీని బలోపేతం చేయడం గురించి తెలంగాణ తెలుగుదేశం నేతలు హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్యనేతలు పాల్గొని పార్టీ పరిస్థితి, భవిష్యత్‌ కార్యాచరణ, ఇతర అంశాలు చర్చించారు. పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా క్షేత్రస్థాయి కార్యాచరణతో పాటు ''సెంటిమెంటు'' అవకాశాలను కూడా పరిశీలించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసల నేపథ్యంలో పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేయడంతోపాటు పార్టీ పేరును సవరించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. పూర్తిగా పేరు మార్చనప్పటికీ, టీడీపీకి ముందు ఎలాంటి పదం లేదా అక్షరం ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే ఓ అభిప్రాయానికి వచ్చారు.

గతంలో తెలుగుదేశం అనే పదానికి ముందు అంటే అన్న తెలుగుదేశం, సామాజిక తెలుగుదేశం, ఎన్టీఆర్‌ తెలుగుదేశం తదితర పార్టీలు రాష్ట్రంలో వచ్చాయని, అవి మనుగడ సాధించలేకపోయాయని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు పార్టీని 'తెలంగాణ తెలుగుదేశం' అని సంబోధిస్తున్నారు. ఇక నుంచి అలా కాకుండా 'తెలుగుదేశం తెలంగాణ శాఖ'గా పిలవాలని అనుకుంటున్నారు. టీడీపీ కంటే ఎలాంటి పదం ఉన్నా లేదా అక్షరం ఉన్నా పార్టీ నిలదొక్కుకోవడం కష్టమని పలువురు వేదపండితులు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, ఈనెల 19న హైదరాబాద్‌లో పార్టీ అధినేత చంద్రబాబుతో జరిగే ప్రత్యేక భేటీలో చర్చించాలని నిర్ణయించారు.

పేరు మార్చిన తర్వాత అయినా తెలుగుదేశం పార్టీకి కాలం కలిసివస్తుందో చూడాలి మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు